మా కేబినెట్ మంత్రి సొంత తమ్ముడి సినిమాకే అనుమతి ఇవ్వలేదు..మీరెంత: కొడాలి నాని
అమరావతి: పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్-రానా నటించిన మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్‌పై రాజకీయ రచ్చ సాగుతోంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల కావడం పట్ల ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలను సంధిస్తోన్నాయి. రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడుతున్నాయి.

విమర్శలపై స్పందించిన కొడాలి నాని..
ఈ విమర్శలు, ఆరోపణలపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచీ ఏదో ఒక విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఇలా రోజూ విమర్శలు చేస్తూ- ఆ పార్టీ నాయకులు జనంలో చులకన అయ్యారని అన్నారు. రోజూ వార్తల్లో నిలవాలి అనే ఒకే ఒక లక్ష్యంతో లేనిపోని ఆరోపణలను చేస్తోన్నారని ధ్వజమెత్తారు. ఇలా వార్తల్లో లేకపోతే- టీడీపీని మర్చిపోతారనే భయం వారిలో ఉందని అన్నారు.

భీమ్లా నాయక్‌కు షరతులు పెట్టలేదు..
భీమ్లా నాయక్ సినిమాకు తమ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి షరతులను పెట్టలేదని కొడాలి నాని స్పష్టం చేశారు. అఖండ, పుష్ప, వైఎస్ జగన్ మిత్రుడు, ఆప్తుడైన నాగార్జున సినిమా బంగార్రాజుకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో.. అవే భీమ్లా నాయక్‌కూ వర్తించాయని అన్నారు. బంగార్రాజుకు తమ కేబినెట్ మంత్రి కురసాల కన్నబాబు సొంత తమ్ముడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారని, అయినా ఆ సినిమాకు ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు.

ఉద్దేశపూరకంగానే 25న విడుదల..
ఈ సినిమాను రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే 25వ తేదీన పవన్ కల్యాణ్ తన సినిమాను విడుదల చేయించాడని కొడాలి నాని ఆరోపించారు. సినిమా టికెట్ల ధరలను ఖరారు చేసిన తరువాత ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. సినిమా ఆడకపోతే నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే తప్ప పవన్ కల్యాణ్ కాదని అన్నారు. తనకు నష్టం ఏమీ లేదనే ఉద్దేశంతోనే- భీమ్లా నాయక్‌ను ఉద్దేశపూరకంగా జీవో విడుదలకు ముందే విడుదల చేశారని విమర్శించారు.

చంద్రబాబు వెనుక ఉండే దొంగలే దీనికి కారణం..
భీమ్లా నాయక్ 25వ తేదీ నాడే విడుదల కావడానికి గల కారణాలను కొడాలి నాని వెల్లడించారు. చంద్రబాబు నాయుడి వెనుక ఉండే దొంగలే పవన్ కల్యాణ్‌ను రెచ్చగొట్టి ఉంటారని విమర్శించారు. ఈ సినిమాను రాజకీయం చేస్తే 2024 ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని ఆశచూపించి ఉండొచ్చని ఆరోపించారు. అదే జరిగితే- ఓడిపోయే సీట్లన్నీ పవన్ కల్యాణ్‌కు కట్టబెడతారని చురకలు అంటించారాయన. పవన్ కల్యాణ్ సినిమా అని తొక్కేయాలనే ధోరణిని వైఎస్ జగన్ ఎక్కడా కనపర్చలేదని అన్నారు.
Recommended Video

లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం..
సవరించిన సినిమా టికెట్లకు సంబంధించిన ఉత్తర్వులపై న్యాయపరమైన అభిప్రాయాలను తీసుకుంటున్నామని కొడాలి నాని అన్నారు. అందుకే జాప్యం ఏర్పడిందని వివరించారు. చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లకుండా, ప్రేక్షకుడిపై టికెట్ల భారం పడకుండా, ఇండస్ట్రీని మరింత ప్రోత్సహించేలా సవరించిన సినిమా టికెట్ల ఉత్తర్వులు ఉంటాయని చెప్పారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల కూడా జీవో విడుదలలో కొంత జాప్యం ఏర్పడిందని అన్నారు.












Click it and Unblock the Notifications