ఐపీఎస్ ల తీరుపై లోకేష్ అసంతృప్తి-చంద్రబాబు ముందే.. ఫిర్యాదు..!
ఏపీలో కూటమి అధికారంలోకి రాక ముందు వైసీపీ పాలనలో ఐపీఎస్ ల తీరుపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్.. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారిపై అసంతృప్తిగానే ఉన్నారు. ఇవాళ తనతో పాటు సీఎం చంద్రబాబు కూడా హాజరైన ఓ కీలక కార్యక్రమానికి ఐపీఎస్ అధికారులు రాకపోవడంపై ఆయన బాహాటంగానే అసంతృప్తి వెళ్ళగక్కారు.. అంతే కాదు దీనిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు.
ఇవాళ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. అయితే ఐపీఎస్ లు మాత్రం ఎందుకనో ఈ కార్యక్రమానిక హాజరు కాలేదు. దీనిపై మంత్రి నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి అధికారిక కార్యక్రమానికి రాని ఐపీఎస్ లకు లొకేష్ చురకలు అంటించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ లు మాత్రమే వచ్చారని.. ఐపీఎస్ లు రాలేదని సీఎం కు చెప్పానని లోకేష్ తెలిపారు.

తాను పాదయాత్ర చేసేటప్పుడు అధికారులు రాజ్యాంగ నిబంధనలను పాటించలేదని, తనతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. దాని ఫలితంగా గత ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని లోకేష్ తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని లోకేష్ తెలిపారు. తద్వారా ప్రభుత్వం మారినా అధికారులు తీరు మార్చుకోకపోవడం సరికాదని ఆయన అక్షింతలు వేశారు.












Click it and Unblock the Notifications