మా బ్రాండ్ ఉపాధి కల్పన.. జగన్ బ్రాండ్ గొడ్డలి: టార్గెట్ చేసిన మంత్రి లోకేష్
కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరు ప్రాంతంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పెద్ద సోలార్ విద్యుత్ కేంద్రాన్ని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. రూ.2,400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవి, సవిత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనితీరుకు సోలార్ ప్లాంట్ ఉదాహరణ: లోకేష్
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఈ సోలార్ ప్లాంట్ ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన పెరిగి, విద్యుత్ ఛార్జీలు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి ఎలా చేస్తుందో ఈ సోలార్ ప్లాంట్ దానికి స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఇప్పటికే అనేక పరిశ్రమలకు కేంద్రంగా మారుతోందని, ఇతర నియోజకవర్గాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

రాయలసీమను "రత్నాల సీమ"గా మార్చడమే లక్ష్యం
ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా కొనియాడారు. 11 నెలల తక్కువ కాలంలోనే ఈ భారీ ప్రాజెక్టు పూర్తి చేయడం వెనుక రైతుల సహకారం కీలకమని ఆయన అన్నారు. రాయలసీమను "రత్నాల సీమ"గా మార్చడమే తమ లక్ష్యమని, ఉపాధి కల్పనను తమ బ్రాండ్‌గా ముందుకు తీసుకెళ్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు
ఈ సోలార్ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు సోలార్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నామని అన్నారు. ఉపాధి కల్పన తమ బ్రాండ్ అని, గొడ్డలి జగన్ బ్రాండు అని ఈ సమయంలో లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపిస్తాం
గత పాలకులు కంపెనీలను తరిమేశారు. మీరు ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నించారని. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చాం అని లోకేష్ అన్నారు. విధ్వంసం చేయడం నిమిషం పని, నిర్మించడం ఎంతో కష్టం అని లోకేశ్ పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications