రోజా వీడియోలు హల్‌చల్, ముక్కు నేలకు రాసి..: సుజాత కంటతడి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి పీతల సుజాత సోమవారం స్పందించారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. రోజా రెడ్డి ఓ దళిత మంత్రి పైన ఆరోపణలు చేస్తుంటే జగన్ రెడ్డి అడ్డుకోలేదని, అదే దళితుల పైన ఆయనకు ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు.
పీతల సుజాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. నీతి, నిజాయితీలకు మారుపేరు దళితులు అన్నారు. రోజా రెడ్డి అగ్రకుల దురహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. తన పైన వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. పార్టీ తరఫున ఏదో మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లుగా నోరు జారొద్దన్నారు.
తాను ఎప్పుడు అహంభావంతో మాట్లాడలేదన్నారు. తాను లావుగా ఉన్నానని రోజా అంటున్నారని, ఆమె మాత్రం సన్నగా ఉందా అని ఎద్దేవా చేశారు. తాను ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడలేదన్నారు. తన పైన చేసిన ఆరోపణలు రోజా నిరూపించాలని లేదంటే అంబేడ్కర్ విగ్రహం ఎదుట ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

రోజా దళిత నేతలను అవమానిస్తుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రోజా అగ్రకుల దురహంకారం తనను బాధించిందన్నారు. తన నిజాయితీని చూసి చంద్రబాబు తనకు మంత్రిగా అవకాశమిచ్చారన్నారు. తన పైన చేసిన ఆరోపణలు రోజా నిరూపించాలన్నారు.
రోజా పైన తాము కూడా అటాక్ చేయగలమని, కానీ చంద్రబాబు తమకు అది నేర్పించలేదన్నారు. దళితులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, అందుకే తమను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేధిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. రోజాపై మార్కెట్లో క్యాసెట్లు హల్ చల్ చేస్తున్నాయని, వాటిపై ఆమె ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
అవినీతి మంత్రంటూ తనపై ఎమ్మెల్యే రోజారెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు. వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలు కనుక నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. పేద కుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చానని, నీతి నియమాలు, సంస్కారంతో పెరిగానని మంత్రి చెప్పారు.
రోజా మాదిరిగా అసభ్యంగా మాట్లాడటం తనకు చేతకాదని, ఆమె మాట్లాడుతున్న మాటలు వింటే మతి పోతోందని, మన సమాజం ఎటు పోతుందో అని భయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజా నిలువెల్లా అగ్రకుల దురహంకారంతో ప్రవర్తిస్తున్నారని అంటూ మంత్రి సుజాత కన్నీరు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications