ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణకు గుండెనొప్పి ? మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స..
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇవాళ స్వల్ప అస్వస్ధతకు గురయ్యారు. ఆయనకు స్వల్పంగా గుండెనొప్పిగా ఉండటంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. వాంతులు కావడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వరుస పర్యటనలతో బిజీగా ఉంటున్న ఆయన అస్వస్ధతకు గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అభిమానులు, నేతలు ఆందోళనకు గురయ్యారు.
అస్వస్ధతతో తాడేపల్లి లోని మణిపాల్ హాస్పిటల్ లో చేరిన మంత్రి వేణుగోపాల్ కృష్ణకు అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధిత పరీక్షలతో పాటు పూర్తి హెల్త్ చెకప్ చేయాలని నిర్ణయించారు. డాక్టర్ల సూచనలతో మణిపాల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మంత్రి వేణుగోపాలకృష్ణకు రేపు ఉదయం వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మంత్రి వేణు గోపాలకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.

వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ బిజీగా తిరుగుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతో సామాజిక సాధికార బస్సు యాత్రలతో పాటు బహిరంగసభల్లోనూ ఎక్కువగా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు రేపు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జగన్ తొలి కేబినెట్ తో మధ్యలో చోటు దక్కించుకున్న ఆయన.. ఆ తర్వాత రెండో కేబినెట్ లోనూ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైసీపీ సామాజిక సాధికార యాత్రల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications