టీడీపీ - జనసేన బీసీ డిక్లరేషన్ తో లెక్కలు మారుతాయా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. సామాజిక సమీకరణాలే లక్ష్యంగా పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సీఎం జగన్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్లు ఖరారు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ -జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. దీని ద్వారా బీసీ ఓట్ బ్యాంక్ తమ వైపు టర్న్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పైన ఏపీ మంత్రులు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
మంత్రుల కామెంట్స్: డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు, పవన్ పేరుతో బీసీలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నించారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్ మండిపడ్డారు. ఇందులో తమ నినాదాలతో సహా నిర్ణయాలను కాపీ చేసారని ధ్వజమెత్తారు.

మొట్టమొదటిసారిగా బీసీ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతూ వెనుకబడిన కులాలు కాదు వెన్నెముక కులాలు, బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు- బ్యాక్ బోన్ క్లాసులు... అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్ లో చెప్పిన మాటల్ని కూడా బాబు-పవన్ కల్యాణ్ కాపీ కొట్టారని విమర్శించారు. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు ఎలాంటి విలువా లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
బీసీలు నమ్ముతారా: 2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు టీడీపీ ఇచ్చిన హామీలెన్నో బీసీలూ మరచిపోలేదన్నారు. 143 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నా ఎవరూ నమ్మరన్నారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్ళలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నా, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నా బీసీలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
తాము ఆదరణ లాంటి 30 పథకాలు అమలు చేశాం అని చెప్పినా, బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ళు ఏడాదిలో పూర్తి చేస్తామని చెబుతున్నారని..వీటిని ఏ ఒక్క బీసీ కులాలవారూ నమ్మరు. జగన్ సీఎం అయిన తరువాత పదవుల నుంచి ప్రాధాన్యతల వరకు బీసీలకు మేలు జరిగిందని వివరించారు.
ఎన్నికల రాజకీయం: ఈ 57 నెలల్లో డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి మొత్తంగా రూ.2.55 లక్షల కోట్లు జమ చేస్తే అందులో బీసీలకు రూ. 1.21 లక్షల కోట్లు అందాయన్నారు. నాన్ డీబీటీని కూడా కలుపుకుంటే ఇది రూ. 1.71 లక్షల కోట్లుగా వెల్లడించారు.
చంద్రబాబు 2014లో బీసీలకు ఏటా రూ. 10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తాం అని చెప్పి చివరికి రూ. 19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మోసం చేశారని విమర్శించారు. ఇక, చంద్రబాబు ను బీసీలు ఏ విధంగా నమ్ముతారని ప్రశ్నించారు. బీసీలంటే బాబు క్లాసు అనే విధంగా జరిగిన ఆ పరిపాలనను గుర్తుకు తెచ్చుకున్న ఏ ఒక్కరైనా మరోసారి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే నమ్ముతారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications