
తాకట్టులో ఆంధ్రప్రదేశ్: మౌలిక ఆర్థిక సూత్రాన్ని మరిచిన వైసీపీ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సర్కారును వదలకుండా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరోమారు పదునైన విమర్శలు సోషల్ మీడియా వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ చేశారు.

రాష్ట్రం వైసీపీ పాలనలో తిరోగమనంలో
వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నదంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక డయాగ్రమ్ ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉదారంగా కొంతమంది ప్రజలకు ఇస్తున్న నవరత్నాలు ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థికవృద్ధి మరోవైపు డయాగ్రమ్ లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
వైసీపీ ప్రభుత్వం భావితరాలకు ఇచ్చే కానుక అప్పులు
వైసీపీ ప్రభుత్వం ప్రజల నుండి వసూలు చేస్తున్న పన్నులను, వివిధ చార్జీలను ఒకవైపు, వైసిపి ప్రభుత్వం భావితరాలకు ఇస్తున్న కానుక అప్పులు, వడ్డీ, చక్ర వడ్డీ అంటూ మరోవైపు చూపిస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ డయాగ్రమ్ ద్వారా పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుండి ఇంటి పన్ను, ఆస్తిపన్ను, చెత్త పన్ను, బస్సు ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, అధిక ధరలకు మద్యం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో దోపిడీ మొదలు పెట్టిందని చూపించారు.

ఎంత మసిపూసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేరు
ఈ విధంగా చేసిన వసూళ్లను వైసీపీ ప్రభుత్వం ఉదారంగా కొంతమందికి ఇస్తున్న నవరత్నాలలో ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి విషయానికి వస్తే అది శూన్యంగా ఉందని వైసీపీ ప్రభుత్వం భావితరాలకు ఇచ్చేది అప్పులు మాత్రమేనని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాకట్టులో ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని అరుపులు అరిచినా, రాష్ట్ర బడ్జెట్ ను ఎంత మసి పూసి మారేడు కాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేరని, పండించిన దానికన్నా ఎక్కువ పంచ లేరని ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టు ఉందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను చూపించే ప్రయత్నం చేశారు.

వైసీపీ సర్కార్ ను పదేపదే టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్
గతంలో కూడా పవన్ కళ్యాణ్ వైసిపి పాలసీ టెర్రరిజం మీద ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అందులో రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను తెలియజేస్తూ, వైసిపి వైఫల్యాలను, వైయస్సార్సీపి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలి అన్న భావనను వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తుతున్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థికవృద్ధి పావలా అయితే సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఖర్చు పెడుతుంది రూపాయని, రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లోకి నెడితే ఆ అప్పుల భారం ఏపీ ప్రజలపైనే పడుతుందని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.