
రాజమౌలిని కట్టప్పతో పోల్చిన ఆర్జీవీ: అక్కడ ట్రిపుల్ ఆర్ టికెట్ రూ.2200: సొంత రాష్ట్రంలో వెన్నుపోటు
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి తెర పడట్లేదు. పైగా మరింత రాజుకుంటోంది. సంక్రాంతి పండుగ సీజన్ సమీపించన వేళ.. కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదానికి శుభం కార్డు పడేలా కనిపించట్లేదు. అటు ప్రభుత్వం, ఇటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు తమ బెట్టు వీడట్లేదు..మెట్టు దిగట్లేదు. ఈ పరిస్థితుల్లో టికెట్ల నిర్ధారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకొద్ది సేపట్లో భేటీ కానుంది.

తెగని వివాదం..
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని-దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మధ్య ఏర్పాటైన సమావేశంలోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. టికెట్లను తగ్గించుకోవాల్సిందేననే తన వాదనకు జగన్ సర్కార్ కట్టుబడి ఉంది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను జగన్ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకోవడం వల్ల దాని ప్రభావం కలెక్షన్లపై చూపుతుందనే ఆందోళన సినీ పరిశ్రమ పెద్దల్లో నెలకొంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనాన్ని కల్పించడం, లోటుపాట్లను సవరించడం వంటి అంశాలను పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

ట్విట్టర్‌కు పని చెప్పిన ఆర్జీవీ..
ఈ వివాదాన్ని రామ్‌గోపాల్ వర్మ మరింత ముందుకే తీసుకెళ్తున్నారు. తాజాగా ఆయన మళ్లీ స్పందించారు. పేర్నినానితో సమావేశమైన మరుసటి రోజే ఆయన మళ్లీ తన ట్విట్టర్‌కు పని చెప్పారు. ఏపీ-మహారాష్ట్ర మధ్య పోలిక పెట్టారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సినిమా టికెట్ల ధరను తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ట్రిపుల్ ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలిని కట్టప్పతో పోల్చారు. బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిస్తే.. ఏపీలో కట్టప్పకే వెన్నుపోటు పొడిచే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. హు కిల్డ్ కట్టప్ప అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.

రాజమౌలి సినిమాకు భారీ రేటు..
రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన సినిమా ట్రిపుల్ ఆర్. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. లేదంటే- సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన విడుదల అయ్యేదే. ఈ మూవీ టికెట్ రేటును మహారాష్ట్ర ప్రభుత్వం 2,200 రూపాయలుగా నిర్ధారించిందని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు.

ఏపీలో రూ.200
ఈ రేటుకు ట్రిపుల్ ఆర్ టికెట్లను అమ్ముకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి సైతం మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. ఎస్ఎస్ రాజమౌలి సొంత రాష్ట్రం ఏపీ ప్రభుత్వం మాత్రం ట్రిపుల్ ఆర్ టికెట్ ధరను 200 రూపాయలకే నిర్ధారించిందని అన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎస్ఎస్ రాజమౌలికి వెన్నుపోటు పొడిచిందనే విషయాన్ని పరోక్షంగా రామ్‌గోపాల్ వర్మ ప్రస్తావించారు. హు కిల్డ్ కట్టప్ప అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.

నార్త్‌లో అన్ని రాష్ట్రాల్లోనూ..
ఉత్తరాది రాష్ట్రాల్లోని అన్ని మల్టీ ప్లెక్సులు, ఐనాక్స్ మాల్స్, ఇన్‌సోమ్నియాల్లో ట్రిపుల్ ఆర్ సినిమా టికెట్‌ను 2,200 రూపాయలకు నిర్దారించాయని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలకు తక్కువ టికెట్లను నిర్దారించడం వల్ల చిత్ర పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టపోతుందంటూ ఆయన వాదిస్తూ వస్తోన్నారు. ఇదివరకు పేర్ని నానిని ఉద్దేశించి వరుస ట్వీట్లను సంధించారు. దీనికి స్పందించిన పేర్ని నాని.. ఆర్జీవీకి అపాయింట్ ఇచ్చారు. దీనితో ఆయన సోమవారమే మంత్రితో సమావేశం అయ్యారు.