AP Municipal elections 2021 Results:జగన్ దండయాత్ర.. మొత్తం 11 కార్పొరేషన్లు వైసీపీ వశం..బేరాలేవమ్మా..!
ఏపీలో మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల వార్ వన్‌సైడ్‌గా ముగిసింది. జగన్ దండయాత్ర మరోసారి కొనసాగింది. ఇక బేరాల్లేవమ్మా అంటూ వైసీపీ మొత్తం 11 కార్పొరేషన్లను కొల్లగొట్టింది. ఇక టీడీపీ కథ కంచికి చేరినట్లయ్యింది. విజయవాడ కార్పొరేషన్, విశాఖ కార్పొరేషన్ పై ఆశలు పెట్టుకున్న తెలుగుతమ్ముళ్లకు శృంగభంగమే మిగిలింది. ఆదివారం రోజున కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వైసీపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఎక్కడా టీడీపీకి అవకాశం లేదు. రాయలసీమలో పట్టును వైసీపీ కొనసాగించింది.
మున్సిపాలిటీ విషయానికొస్తే ఒక్క అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో పసుపు జెండా ఎగురగా... కడప జిల్లా మైదుకూరులో ఒక సీటు ఎక్కువగా టీడీపీ నెగ్గింది. మైదుకూరులో మొత్తం 25 వార్డులు ఉండగా...టీడీపీ 12 వార్డులు వైసీపీ 11వార్డులు ఇతరులు 1 వార్డు గెలిచాయి. అయితే ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లతో మైదుకూరు మున్సిపాలిటీ కూడా సాంకేతికంగా వైసీపీ ఖాతాలో పడతాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఓటు, మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామిరెడ్డిల ఓట్లు వైసీపీకి వెళతాయి కాబట్టి ఇక్కడ మున్సిపల్ ఛైర్మెన్ పదవి ఫ్యాన్ పార్టీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.తాడిపత్రిలో కూడా అద్భుతం జరిగే అవకాశాలుంటే తప్ప సీటు వైసీపీ ఖాతాలో చేరదు.

మొత్తానికి ఎన్నో అవాంతరాలు, కోర్టు తలపులను తట్టి చివరాఖరకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. అయితే గుంటూరు, విశాఖ, విజయవాడలో కూడా వైసీపీ కైవసం చేసుకోవడంతో ఇక రాజధాని తరలింపునకు ప్రజామోదం ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా పెద్దగా ప్రభావం చూపలేదని.. కేవలం సంక్షేమం, అభివృద్ధి మంత్రాలే వైసీపీని విజయతీరాలకు చేర్చాయని వైసీపీ ముఖ్యనాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications