గుంటూరు-బెజవాడ: మంత్రులకు బాబు క్లాస్! బిజీ బిజీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా విజయవాడ - గుంటూరు ప్రాంతం అనువైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు కూడా చెబుతున్నారట. విజయవాడ - గుంటూరుల మధ్య రాజధాని నిర్మిస్తే ఆ రెండు ప్రాంతాలు కలిసిపోతాయని, హైదరాబాదులో సగం స్థాయిలోనైనా ఉంటుందని బాబు సోమవారం చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం పలువురు మంత్రులతో భేటీ అయ్యారు.
రాజధాని, మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి.. తదితర అంశాల పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని అయితే బాగుంటుందని వారితోను అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇక్కడ రైతుల నుంచి సేకరించిన భూమికి 60 శాతం మేర పరిహారం చెల్లించి, మిగిలిన 40 శాతం మేర వేరే ప్రాంతంలో వారికి భూమిని కేటాయించనున్నారు. రోడ్లు, విద్యుత్ సకల సౌకర్యాలు కల్పించనున్నారు.

భూసేకరణ కష్టమైతే రాజధాని కోసం వేరే ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టనున్న 100 స్మార్ట్ సిటీల జాబితాలో వీటిని కూడా చేర్చాలని కోరతామని తెలిపారు.
కాగా, జిల్లాల్లో వర్గాలు, విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని చంద్రబాబు మంత్రులకు హితబోధ చేశారు. ప్రజలు తమపై ఎంతో గురుతర బాధ్యతలు పెట్టారనే విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్లాలన్నారు. నాడు టిడిపి చేపట్టిన మంచి పనులు ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయని, అందుకే పదేళ్లు పార్టీ ఎన్నో ఆటుపోట్లకు గురైనా నమ్మకంతో తిరిగి అధికారం కట్టబెట్టారన్నారు.
పరిటాల సునీతతో జరిపిన ముఖాముఖిలో పరిటాల రవి సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం రవి ఎంత కష్టపడ్డారో మీరు అంతే కష్టపడుతున్నారని కితాబిచ్చారు. పరిటాల కుటుంబానికి ప్రజల్లో, పార్టీలోను గుర్తింపు ఉంటుందని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications