చంద్రబాబు కేసులపై గవర్నర్ తో చర్చ, 17ఏ - క్లియర్, ఇక ముందుకే..!?
ఏపీ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. స్కిల్ కేసులో చంద్రబాబు 32 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. సీఐడీ ఎదుట లోకేష్ విచారణకు హాజరవుతున్నారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. స్కిల్ కేసులో బెయిల్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అటు సుప్రీంలో క్వాష్ పిటీషన్ విచారణ సాగుతోంది. ఈ సమయంలోనే ఏపీ అధికారులు గవర్నర్ తో భేటీ అయ్యారు. చంద్రబాబు కేసులపై చర్చించారు. కీలక దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
గవర్నర్ తో అధికారుల భేటీ: చంద్రబాబు కేసుల్లో ఇప్పుడు సుప్రీంలో జరుగుతున్న కేసు..విచారణ కీలకంగా మారుతోంది. స్కిల్ కేసు లో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ డిస్మిస్ కావటంతో..సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రధానంగా 17ఏ గురించి వాదనలు వినిపిస్తున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసారని..అరెస్ట్ చట్ట ప్రకారం సరి కాదని కోర్టు ముందు వాదిస్తున్నారు.

కేసు విచారణ..ఎఫ్ఐఆర్ నమోదు తేదీలు ఈ 17ఏ అమలు విషయంలో ప్రధానంగా రెండు పక్షాల నుంచి వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ శ్రీరాం గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం ఇప్పుడు రాజకీయంగానూ ఉత్కంఠ పెంచుతోంది.
చంద్రబాబు కేసులపై చర్చ: ఈ సమావేశంలో ప్రధానంగా చంద్రబాబు కేసుల గురించే ఈ ముగ్గురు గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పైన దాఖలైన స్కిల్ కేసు, ఫైబర్ గ్రిడ్, అమరావతి రింగ్ రోడ్డు కేసుల గురించి గవర్నర్ కు నివేదించినట్లు సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ అంశాల్లో అవినీతికి పాల్పడ్డారనేది విచారణ సంస్థల అభియోగం.
ప్రస్తుతం విచారణ జరుగుతున్న కేసుల్లో అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టుల్లో బలంగా వాదిస్తున్నారు. మరో వైపు ఈ కేసుల్లో చంద్రబాబు పై సీఐడీ ఇప్పటికే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు గవర్నర్ ను హఠాత్తుగా కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సుప్రీం తీర్పుకు అనుగుణంగా: గవర్నర్ అబ్డుల్ నజీర్ సైతం న్యాయ నిపుణులు. దీంతో, ఈ కేసుల వ్యవహారం వివరించే సమయంలో పూర్తి సమాచారం ఇచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైన నిర్ణయం ఈ రోజు వెలువడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
చంద్రబాబు క్వాష్ పిటీషన్ లో సుప్రీం తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే మిగిలిన రెండు కేసుల్లో సెక్షన్ 17ఏ ప్రకారం ముందుకు వెళ్లే అంశం పైన అధికారులు గవర్నర్ ను కలిసారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో, ఇప్పుడు సుప్రీంలో ఈ రోజు జరిగే విచారణ..న్యాయస్థానం నిర్ణయం..ఆ తరువాత మిగిలిన కేసుల్లో చోటు చేసుకొనే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications