రెండో విడత పంచాయతీ ఎన్నికలు: ఈ సారి ఎలా ఉంటుందో? ఎలాంటి ఫలితాలొస్తాయో?
అమరావతి: రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 175 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలను నిర్వహించబోతోంది ఎస్ఈసీ. ఆయా డివిజన్లలో 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు రెండో విడతలో ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన షెడ్యూల్ చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
పంచాయతీ పోలింగ్‌లో కీలక మార్పు: తొలిసారిగా ఆ వ్యవస్థ ఇంట్రడ్యూస్: అభ్యర్థులపై
4వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 5వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది 6వ తేదీన నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు 7వ తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి తుది గడువు..8వ తేదీ. 13వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఆరంభమౌతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను చేపడతారు.

చివరి రెండు విడతల్లో అంటే.. ఈ నెల 17, 21వ తేదీల్లో నిర్వహించే పోలింగ్ కోసం ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ఆరంభమౌతుంది. తొలి విడతలో అంచనాలకు మించిన స్థాయిలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. పంచాయతీలు, వార్డుల కోసం వేల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 9వ తేదీన తొలి విడత పోలింగ్ జరుగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలకు అనుగుణంగా సర్పంచ్‌ను ఎంపిక చేస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎంపిక ఉంటుంది. నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసిన తరువాతే.. స్థానిక పాలన అధికారికంగా ప్రారంభమౌతుంది.