అమెరికా వెళ్లిన గన్నవరం పాస్టర్ అదృశ్యం: ఏపీలో భార్య ఫిర్యాదు, కేసు నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అమెరికా వెళ్లిన గన్నవరం పాస్టర్ అదృశ్యమయ్యారు. దీంతో అమరికా వెళ్లిన తన భర్త జాడ తెలియజేయాలని పాస్టర్ భార్య కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. పాస్టర్ అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే... గన్నవరా సాయినగర్ ప్రాంతానికి చెందిన పాస్టర్ వీరపనేని జాన్సన్ చౌదరి (38) ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం జూన్ 4న అమెరికా వెళ్లాడు. విమాన ప్రయాణానికి తీసుకున్న తేదీల మేరకు ఈ నెల 12న లాస్ ఏంజిల్స్‌లో విమానం ఎక్కి లండన్ చేరుకుని, అక్కడి నుంచి 14వ తేదీన హైదరాబాద్‌లో దిగాల్సి ఉంది.

అనంతరం అక్కడ నుంచి జులై 15న గన్నవరానికి చేరుకోవాల్సి ఉంది. ఈ నెల 11వ తేదీ వరకు ఫోన్లో భార్యతో మాట్లాడిన జాన్సన్ చౌదరి, జులై 13 రాత్రి ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆందోళనకు గురైన ఆమె విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్‌కు శనివారం ఫిర్యాదు చేశారు.

AP Pastor from Gannavaram goes missing in America

సీపీ ఆదేశాల మేరకు గన్నవరం సీఐ ఆలీ విచారణ చేపట్టారు. ఆమె నుంచి మరింత సమాచారం సేకరించారు. పాస్టర్ ఏయే ప్రాంతాల్లో పరిచర్యలు చేస్తారో అడిగి తెలుసుకున్నారు. తిరిగి వచ్చేందుకు ఈ నెల 13న అమెరికాలో బయలుదేరినట్లు, 14న భారత్‌కు వస్తున్నట్లు సమాచారం కూడా ఇచ్చాడని భార్య పేర్కొంది.

భర్త రాక కోసం సుభాషిణి ఎయిర్‌పోర్టుకు కారు కూడా పంపారు. ఆయన ఫోన్ స్పందించక పోవటంతో సుభాషిణి ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. దీంతో చివరి కాల్ సిమివ్యాలి నుంచి చేసినట్టుగా ఆమె పోలీసులకు తెలిపారు. కాగా జాన్సన్ చౌదరి 'హోలీ గాడ్ మినిస్ట్రీస్ ఇండియా' సంస్థను స్థాపించి వీరపనేనిగూడెం గ్రామంలో ఓ అనాథాశ్రమం స్థాపనకు స్థలం సేకరించాడు.

కాగా ఆశ్రమ స్థాపనకు అవసరమైన నిధుల సేకరణకు అమెరికా వెళ్లినట్లు సమాచారం. దీనిపై విమానయాన సంస్థలను విచారించగా ఈ నెల 14వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో విమానం ఎక్కడానికి జాన్సన్ చౌదరి విమానాశ్రయానికి రాలేదని, బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదని పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉంటే అదృశ్యమైన పాస్టర్ వీరపనేని జాన్సన్ చౌదరి ఆంధ్రప్రదేశ్ టీడీపీ క్రిస్టియన్ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Pastor from Gannavaram goes missing in America.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి