Chalo Vijayawada : నేడు మరో ఛలో విజయవాడ- ఎక్కడికక్కడ అరెస్టులతో టెన్షన్..
రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలు ఇవాళ ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకుని భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు రోజుల క్రితమే వీరికి విజయవాడ రావొద్దని హెచ్చరికలు చేసిన పోలీసులు.. ఇవాళ నగరంలోకి అడుగుపెట్టకుండా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో భారీ ఎత్తున ఉన్న అంగన్ వాడీ వర్కర్లు కొంతకాలంగా వేతనాలు పెంపు, మినీ అంగన్ వాడీ వ్యవస్ధ రద్దు, అధికారుల వేధింపులు తగ్గించాలన్న డిమాండ్లతో ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోరు బాట పట్టారు. ఇందులో భాగంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజధాని ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేస్తే ప్రయోజనం ఉంటుందని భావించి ఛలో విజయవాడ పిలుపునిచ్చారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సెక్షన్ 1444తో పాటు పోలీసు యాక్ట్ లోని సెక్షన్ 30 కూడా అమలు చేస్తున్నారు. దీంతో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని పోలీసు కమిషనర్ క్రాంతి రాణా టాటా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న అంగన్ వాడీ వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయినా వారు మారు వేషాలతో విజయవాడకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

అంగన్వాడి(CITU, AITUC, IFTU) ,మిడ్ డే మీల్స్ వర్కర్స్ (AITUC) అధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి స్ధానిక పోలీసు అధికారులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కమిషనరేట్ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ, సీఆర్పీసీ, పోలీసు చట్టాల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ేలీసులకు అందిన సమాచారం ప్రకారం కొంతమంది బయటి వ్యక్తులు ఈ ధర్నా కార్యక్రమములో చేరి హింసకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా ఏ విధమైన అనుమతులు ఇవ్వలేదన్నారు.












Click it and Unblock the Notifications