మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదినారాయణరెడ్డి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పులిపాటి ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు.
బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరి పొలాల్లోకి పారిపోయాడని ప్రవీణ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారు.. తమపై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారని ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. దీంతో ఆదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా మందడం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమరావతి ఉద్యమం 1,200 రోజులకు చేరుకున్న నేపథ్యంలో రైతులకు బీజేపీ నేత సత్యకుమార్ మద్దతు తెలిపి.. తిరిగి వెళ్తుతుండగా మూడు రాజధానుల శిబిరం వద్ద కొందరు అడ్డుకున్నారు. సత్యకుమార్ కారు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని ముందుకు పోనివ్వగా.. సత్యకుమార్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపట్టాయి.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు తమ తమ గ్రామాల్లో చేపట్టిన దీక్షా శిబిరాలు 1200 రోజులను పూర్తిచేసుకున్నాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమది మూడు రాజధానుల విధానమంటూ కర్నూలు, అమరావతి, విశాఖపట్నాన్ని రాజధానులుగా ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత రైతులు పోరుబాట పట్టారు.












Click it and Unblock the Notifications