నల్గొండ ఎన్‌కౌంటర్: ఏపీలో అలర్ట్, డీజీపీ ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా జానకీపురంలో జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీజీపీ రాముడు అన్ని జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఘ నగర కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
వాహనాల తనిఖీలకు సరైన సన్నద్ధతతో వెళ్లాలని, రక్షక కవచాలను ధరించాలని సూచించారు. తనిఖీలుకు సాయుధ బృందాలను దించాలన్నారు. తక్షణ స్పందన బృందాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఏపీ డీజీపీ జేవీ రాముడు రంగంలోకి దిగి తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోను మాట్లాడారు.
ఆ తర్వాత హైదరాబాద్, గుంటూరు, బెజవాడ పోలీసులను ఘటనాస్థలి(జానకీపురం)కి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బెజవాడ, గుంటూరు పోలీసులు నల్గొండ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరూ సిమి కార్యకర్తలను వార్తలు వచ్చాయి.

గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సిమి ఉగ్రవాదులు తలదాచుకొనే అవకాశం ఉందని, పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించాలని ఆయా జిల్లాల పోలీసు అధికారులను డీజీపీ ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ తమ పరిధిలో సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, ఏదైనా అవసరమైతే హెడ్ క్వార్టర్స్‌కు సమాచారమివ్వాలని డీజీపీ సూచించారు. ప్రార్థనా స్థలాలు, పర్యాటక కేంద్రాలు, విదేశీయులు బసచేసే హోటళ్లు తదితర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో చోటుచేసుకున్న వరుస కాల్పుల సంఘటనల నేపథ్యంలో ఏపీలోనూ హై అలర్ట్ ప్రకటించినట్లు హోంమంత్రి చినరాజప్ప చెప్పారు.












Click it and Unblock the Notifications