ఏపీలోని ఈ జిల్లాలకు మళ్ళీ భారీ వర్షాల వార్నింగ్ ఇచ్చిన బంగాళాఖాతం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భారీ వర్షాల హెచ్చరికను పంపింది బంగాళాఖాతం. రానున్న 24 గంటలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఏపీ పై ప్రభావాన్ని చూపిస్తుందని మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో గత నెల రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చలికాలంలో కూడా వర్షాల దెబ్బకు ఏపీ వాసులు విలవిలలాడుతున్నారు. మళ్ళీ మరోమారు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం
ప్రస్తుతం బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి రానున్న 24 గంటల్లో అల్పపీడనం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు శ్రీలంక తీరాల వైపు ప్రయాణం చేస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఏపీలో వర్షాలు అప్పటి నుండే
దీని కారణంగా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు, యానం ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీని కారణంగా మూడు నాలుగు రోజులపాటు సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ జిల్లాల ప్రజలు అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని మిగతా కొన్ని జిల్లాలలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు .ఇక భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications