ఏపీపై బంగాళాఖాతం కన్నెర్రజేసింది.. ఉగ్ర గోదావరి ముప్పు పొంచిఉంది!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గోదావరి, కృష్ణ పరివాహ ప్రాంతాలలో పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాస్త వర్షం ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాలలో వరద తీవ్రత పెరుగుతుంది.
ఏపీలో వర్ష బీభత్సం
రోడ్లు కోతకు గురి కావడంతో పాటు రహదారుల పైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏలూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాలలోని వందలాది గ్రామాలకు వర్షాలు, వరదల కారణంగా రాకపోకలు స్తంభించాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

నేడు ఏపీలో వర్షాలు ఇక్కడే
ఇదిలా ఉంటే నేడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నేడు మన్యం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఏపీలో నేడు ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
ఇక నేడు ఏలూరు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు, రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని దీనికోసం 21.50 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
వర్షాలపై హోం మంత్రి అనిత ఫోకస్
ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవలసిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. అంతే కాదు రాష్ట్రంలోని వర్షాలపైన ముఖ్యంగా వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పైన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు దిశ నిర్దేశం చేశారు..
ఏపీలో వర్షాలపై శ్రీకాకుళం,విజయనగరం,అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లుతో వీడియో కన్ఫరెన్స్ లో పాల్గొని,ఆయా జిల్లాలో వర్షాల ప్రభావం, తాజా పరిస్థితిపై ఆరా తీయడం జరిగింది. pic.twitter.com/F8tlKahSZK
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 20, 2024
వర్షాలతో భయాందోళన మధ్య ముంపు గ్రామాలు
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో 195 గ్రామాలపైన వరద ప్రభావం అధికంగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు వర్షాల కారణంగా అనేక చోట్ల ఆస్తి నష్టం జరగడంతో పాటు అధికారికంగా ఒకరు మరణించినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద 4.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications