తుఫాన్ చీకట్ల నుంచి ఏపీని బయటపడేసిన 3 రాష్టాలు- 3 వేల మంది అరుదైన సాయం..!
ఏపీని వరుసగా రెండు తుపాన్లు వణికించాయి. ముందు అర్నబ్, ఆ తర్వాత మురసు తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తా అల్లాడింది. తుఫాన్ గాలులకు వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వీటిని పునరుద్దరించే యంత్రాంగం రాష్ట్రంలో లేదు. దీంతో పొరుగు రాష్ట్రాల సాయం కోరింది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో కర్నాటక, తమిళనాడు, తెలంగాణ మూడు రాష్ట్రాలు కదిలాయి. మొత్తం 3 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించాయి. వీరంతా రాత్రింబవళ్లూ శ్రమించి దాదాపుగా కరెంటును పునరుద్దరించారు.
ఏపీలో రెండు తుఫాన్ల కారణంగా విద్యుత్ వ్యవస్థ (Electricity) అస్తవ్యస్ధమైంది. దీంతో విద్యుత్ పునరుద్ధరణకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి మూడు వేల మందికిపైగా సిబ్బందిని ఆయా ప్రభుత్వాలు పంపాయి. వీరంతా గత కొన్ని రోజులుగా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో నిరంతరం శ్రమించారు. వీరికి కావాల్సిన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంతో వీరు తమ అనుభవాన్ని అంతా రంగరించి రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నిలబెట్టారు. తద్వారా వేల ఇళ్లలో తిరిగి వెలుగులు నింపారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం నిడమానూరులో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని విద్యుత్ మంత్రి గొొట్టిపాటి రవి కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

వీరి పట్టుదలతో గోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు నిన్న సాయంత్రానికే పూర్తిస్థాయిలో సరఫరా పునరుద్దరించారు. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనూ 70 శాతం సరఫరా పునరుద్దరించారు. శనివారానికి 100 శాత కరెంటు సరఫరా పునరుద్దరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా అలవలపాడులో స్తంభాలను తిరిగి నిలబెట్టే పనుల్లో ఉన్న కర్ణాటకలోని బళ్లారి సిబ్బందితో, నిడమానూరు వద్ద పనిచేస్తున్న తమిళనాడు సిబ్బందితో మాట్లాడి మంత్రి గొట్టిపాటి పనుల పురోగతిని తెలుసుకున్నారు. పునరుద్ధరణ పనుల్లో ఉన్న సిబ్బందికి నాణ్యమైన భోజనం, వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సిబ్బందిని రప్పించారని ఆయన తెలిపారు. విపత్కర సమయంలో సహకరించిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యుత్ శాఖ మంత్రులు, సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.













Click it and Unblock the Notifications
