ఏపీలో వీఆర్ఏలకు ఫేస్ యాప్ మినహాయింపు- సర్కార్ కు ఉద్యోగుల వినతి- షాకింగ్ రీజన్స్
ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ముఖ గుర్తింపు ఆధారిత హాజరు) యాప్ ను తీసుకొచ్చింది. దీన్ని ఉద్యోగులందరికీ తప్పనిసరిగా వర్తింపచేయాలని ఇప్పటికే శాఖాధిపతులకు సర్కులర్ లు పంపుతోంది. దీంతో ప్రతీ ఉద్యోగినీ ఇందులో చేర్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్ఏలను ఇందులో నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏ)లకు "ఫేస్ యాప్ అటెండెన్స్" నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ రెవెన్యూ సేవల సంఘం ఇవాళ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు ఉండాలనే విధానం తీసుకొచ్చింది. ఈ పద్దతిని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) లకు కూడా వర్తింప చేయాలని జిల్లా అధికారులు అదేశిస్తుండడం వలన రాష్ట్రంలోని వీఆర్ఏలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని రెవెన్యూ సేవల సంఘం తెలిపింది.

వీఆర్ఏలకు ఫేస్ యాప్ నుంచి మినహాయింపు కోరడం వెనుక పలు కారణాల్ని తమ లేఖలో రెవెన్యూ సేవల సంఘం వెల్లడించింది. గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లు పార్ట్ టైమ్ వృత్తి గా పనిచేసే ఉద్యోగులని, వీరికి ఇచ్చే జీతభత్యాలు గౌరవ వేతనమేనని తెలిపింది. అంతే కాకుండా వీరికి వచ్చే అతి తక్కువ జీతముతో స్మార్ట్ ఫోన్ కాదు కదా, అసలు ఏపోన్ కూడా కొనుకోలేని ఆర్దికపరిస్దితి ఉందని పేర్కొంది. దశాబ్దాలుగా పనిచేస్తున్న వీరిలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు ఉన్నారని తెలిపింది.
అలాగే అసలు సెల్ పోన్ వాడకం తెలియని వారు కూడా ఉన్నందున వీరందరికి ముఖ ఆధారిత హాజరు పద్దతి నుండి మినహా ఇవ్వాలని ఏపీ రెవిన్యూ అసోషియేషన్ అలాగే ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర సంఘాలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమీషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ ను కోరాయి. దీనిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమీషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications