ఏపీలో ఉచిత ఇసుక పాలసీ ఆలస్యం ? విడుదల కాని జీవో..!
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తామని వారం రోజులుగా చెప్తున్న ప్రభుత్వం ఇవాళ మాత్రం ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇవాళ్టి నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు సిద్దమైన ప్రభుత్వం కనీసం ఒక రోజు ముందు మార్గదర్శకాలు జారీ చేస్తుందని భావించినా అలా జరగలేదు.
దీంతో ఇవాళ ఉదయమైనా వీటిని విడుదల చేస్తుందని అంతా భావించారు. కానీ ఇసుక ర్యాంప్ ల వద్ద లారీలు ఎదురుచూస్తున్నా ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఛార్జీలతో పాటు దాని లోడింగ్, తరలింపు, ఇతర పన్నులు కలిపి టన్నుకు రూ.475 వరకూ వసూలు చేసేవారు. దీని స్ధానంలో కేవలం లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే జూలై 8న ఉదయం 6 గంటల నుంచే లోడింగ్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుకను అమ్మకాలు ప్రారంభిస్తామని వెల్లడించింది. దీంతో లారీలు ఈ ఉదయం నుంచే పాయింట్ల వద్ద బారులు తీరాయి. కానీ ప్రభుత్వం మార్గదర్శకాలు మాత్రం విడుదల చేయలేదు.
ఓసారి ఉచిత ఇసుక మార్గదర్శకాలు విడుదల అయితే తప్ప లోడింగ్ పాయింట్ల నుంచి తరలింపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జీవో ఇచ్చే విషయంలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం లోపు ఇసుక అమ్మకాల మార్గదర్శకాలతో జీవో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. ఓసారి జీవో విడుదలైతే ఇసుక అమ్మకాలపై క్లారిటీ రానుంది. ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డు వివరాలు తీసుకుని కేవలం 20 టన్నుల ఇసుక మాత్రమే ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications