AP Schools Bandh : ఎల్లుండి ఏపీలో స్కూళ్ల బంద్- విద్యార్ధులకు అలర్ట్..!
ఏపీలో ఎల్లుండి ఒక్కరోజు విద్యాసంస్ధలు మూతపడనున్నాయి. రాష్ట్రంలోని స్కూళ్లలో సౌకర్యాల కొరత, టీచర్ల కొరత, కార్పోరేట్ విద్యాసంస్ధల ఫీజుల దోపిడీని నిరసిస్తూ విద్యార్ది సంస్ధ అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఏబీవీపీ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో జూలై 5న ఒక్కరోజు స్కూళ్లు మూసివేసేందుకు విద్యాసంస్ధలు సిద్దమవుతున్నాయి. ఈ మేరకు విద్యార్ధుల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు.
ఏపీ స్కూళ్లలో ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పనులు చేపడుతోంది. అయినా ఇంకా పలు చోట్ల సౌకర్యాల కొరత వేధిస్తోంది. అలాగే స్కూళ్ల విలీనం, విద్యాసంస్కరణల కారణంగా అక్కడక్కడా టీచర్ల కొరత కనిపిస్తోంది. అయితే డిమాండ్ కు అనుగుణంగా టీచర్లను ఇప్పటికిప్పుడు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ బంద్ పిలుపునిచ్చింది.

అలాగే రాష్ట్రంలో ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్ధల ఫీజుల దోపిడీ కొనసాగుతోంది. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం గతంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసినా ప్రైవేటు స్కూళ్లలో దోపిడీ మాత్రం ఆగలేదని తెలుస్తోంది. దీంతో ఏబీవీపీ ప్రభుత్వ స్పందన కోరుతూ స్కూళ్ల బంద్ కు పిలుపునిచ్చింది. ఇలా స్కూళ్లలో పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ బంద్ కు మద్దతు ఇవ్వాలని ఏబీవీపీ నేతలు పిలుపునిస్తున్నారు.
ఏబీవీపీ బంద్ పిలుపుకు అనుగుణంగా పలు విద్యాసంస్ధలు ముందుగానే సెలవు ప్రకటిస్తున్నాయి. మరికొన్ని విద్యాసంస్ధలు పరిస్దితిని బట్టి సెలవు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. మరికొన్ని స్కూళ్లు స్వచ్చందంగానే మూతపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో విద్యార్ధులు స్దానిక పరిస్ధితుల ఆధారంగా జూలై 5న స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications