ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా?- ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ..!
ఏపీ అర్ణబ్ తుఫాన్ (cyclone Arnab) తీరం దాటినా ఇంకా కోస్తా జిల్లాలపై దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. పలు చోట్ల భారీ వర్షాలు, ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. దీంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు, సాధారణ ప్రజలు, అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఇలాంటి సమయంలో స్దానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే విమర్శలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (AP SEC) భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల తేదీలు ముందుకు జరపడంతో మరో ఇబ్బంది మొదలైంది. దీంతో ముందుగా పరిషత్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసేందుకు అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 3న జరగాల్సి ఉంది. ఇప్పుడు అర్ణబ్ తుఫాన్ కారణంగా అభ్యర్ధులు ఎన్నికల ప్రచారం కూడా చేసుకోలేని పరిస్ధితి ఉంది. దీంతో వచ్చే నెల 3న జరగాల్సిన పోలింగ్ ను 5వ తేదీకి మార్చాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఓట్ల లెక్కింపును 5వ తేదీ నుంచి 7వ తేదీకి వాయిదా వేసే అవకాశం ఉంది. ఇవాళ దీనిపై ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన చేయనుంది.

ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియను ఈ నెల 28 నుంచి నవంబర్ 1కి వాయిదా వేశారు. అలాగే ఓట్ల లెక్కింపు సైతం ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు అర్ణబ్ తుఫాన్ ప్రభావం, అలాగే పరిషత్ ఎన్నికల తేదీలు, ఇలా పలు కారణాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ను ముందుకు జరిపేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ ఎస్ఈసీ ఓ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అర్నబ్ తుఫాన్ ప్రభావం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. తుపాను ప్రభావం ఇవాళ, రేపు మాత్రమే ఉండి, తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ విభాగం నుంచి ఎస్ఈసీకి సమాచారం ఉంది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదాపై అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
