ఏపీలో పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదల- మార్చి 10న ఎన్నికలు- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో కరోనా కారణంగా గతంలో వాయిదాపడిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ విడుదల చేశారు. గతంలో ఎక్కడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో తిరిగి అక్కడి నుంచే తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని ప్రకారం మార్చి 2న పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 10న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12 కార్పోరేషన్లతో పాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
ఏపీ మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం- నేడు ఎస్ఈసీ ప్రకటన- ఆగిన చోట నుంచే మళ్లీ


మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 21తో ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల కోసం ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెలలో జరిగే పురపాలక ఎన్నికల ప్రక్రియ గతంలోఎక్కడ నిలిపివేశారో అక్కడి నుంచే తిరిగి మొదలు కానుంది. దీనిపై రాజకీయ పార్టీలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం మార్చి 2న పురపాలక ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోంది.

మార్చి 2న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ షురూ
గతేడాది కరోనా కారణంగా పురపాలక ఎన్నికలు వాయిదా పడే నాటికి నామినేషన్లు పూర్తయ్యాయి. అయితే వాటిని ఉపసంహరించుకునేందుకు అభ్యర్ధులకు ఇచ్చిన గడువుకు ముందే ఎన్నికలు వాయిదా పడిపోయాయి. దీంతో ఇప్పుడు తిరిగి నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా మార్చి 2న నోటిఫికేషన్ జారీ అవుతుంది. అలాగే ఒక్కరోజు గడువుతో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది..

మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అదే రోజు బరిలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ఎస్ఈసీ విడుదల చేయనున్నారు. మార్చి 10న పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13న నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపును ఆదివారం మార్చి 14న చేపడతారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

మున్సిపల్ ఎన్నికలు ఎక్కడెక్కడంటే
రాష్ట్రంలో మొత్తం 12 నగర పాలక సంస్ధలతో పాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నింటికీ మార్చి 10న పోలింగ్ ఉంటుంది. 12 నగర పాలక సంస్ధల్లో విజయనగరం, గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ), ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పోరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే అన్ని జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న, కోర్టు కేసులు లేని 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తారు.