ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో కూటమి సర్కార్ ఇవాళ రాష్ట్ర సచివాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని మరోసారి పొడిగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరబోతోంది.
ఏపీ సచివాలయ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల డ్యూటీని మరో ఏడాది పొడిగిస్తూ ఇవాళ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వారు కొన్నేళ్లుగా వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రతీ ఏడాదీ వీరికి ఏడాది పొడిగింపు ఇస్తూ వస్తున్నారు. దీన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సచివాలయ ఉద్యోగులతో పాటు మరికొందరికి కూడా ఈ ఊరట కొనసాగనుంది.

అమరావతిలో ఉన్న సచివాలయ ఉద్యోగులతో పాటు డిపార్ట్మెంట్ హెడ్ లు, కార్పొరేషన్ విభాగ అధిపతులకు కూడా ఇలా వారానికి 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధనను పొడిగించారు. వాస్తవానికి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈనెల 26 తో ముగుస్తుంది. దీంతో గడువును మరో ఏడాది అంటే 27 జూన్ 2026 వరకు పొడిగిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమరావతి రాజధాని పనులు కీలకంగా మారాయి. వీటిని పూర్తి చేయాలంటే మరికొంతకాలం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications