లైంగిక నేరస్తులపై ఏపీ సర్కార్ సీరియస్ యాక్షన్.. వారిపై సెక్సువల్ అఫెండర్ షీట్లు, నిఘా!
ఎన్ని చట్టాలు ఉన్నా, ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు నిత్య కృత్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో లైంగిక వేధింపులను మరింత సీరియస్ గా తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఏపీ రాష్ట్ర పోలీస్ విభాగం లైంగిక నేరాలను అరికట్టే ప్లాన్ లో భాగంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు లైంగిక నేరగాళ్లకు షాక్ ఇస్తోంది.
లైంగిక నేరాలకు పాల్పడినవారు, శిక్ష పడినవారు, నిందితులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వారిపై సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరిచి నిరంతర నిఘా పెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,796 మందిపై ఈ షీట్లు అమలులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 27 నెలల్లోనే 3,207 మందిపై ఈ షీట్లు తెరిచారు.

గతంలో 2012 నుంచి 2024 వరకు 12 సంవత్సరాల కాలంలో 2,589 మందిపై మాత్రమే షీట్లు తెరిచినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వ హయాంలోనే గత 12 ఏళ్ల కంటే ఎక్కువ మందిపై షీట్లు నమోదు కావడం గమనార్హం. ఈ సెక్సువల్ అఫెండర్ షీట్లలో అన్ని వివరాలు ఉంటాయి.
నిందితుల పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఫొటో, గతంలో నమోదైన లైంగిక నేరాల కేసుల వివరాలు, ఏయే పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారా లేదా జైలులో ఉన్నారా వంటి సమాచారం అన్నీ పొందుపరుస్తున్నారు. ఇలా సమగ్ర సమాచారం ఉండటం వల్ల పోలీసులు వారి కదలికలను సులభంగా ట్రాక్ చేయగలుగుతున్నారు.
గతంలో లైంగిక నేరాలు పదేపదే చేసేవారిపై రౌడీ షీట్లు తెరిచేవారు. అయితే అవి సాధారణ రౌడీషీట్లుగా ఉండేవి కాబట్టి లైంగిక నేరాల కోణంలో ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరవడం ద్వారా వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జియోట్యాగింగ్, డిజిటల్ మానిటరింగ్ వంటి ఆధునిక వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు.పోలీసులు ఈ నేరస్థుల తాజా ఫొటోలతో ప్రత్యేక డేటాబేస్ సిద్ధం చేశారు.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన సీసీ కెమెరాలకు ఈ డేటాబేస్‌ను అనుసంధానం చేశారు. వీరు ఎక్కడైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వెళ్తుంది. ఆ తర్వాత స్థానిక పోలీసులు వెంటనే స్పందించే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నారు.
నివాస ప్రాంతాల్లోనూ వారి ప్రవర్తనపై పోలీస్ స్టేషన్ స్థాయిలో నిఘా పెడుతున్నారు.ఈ చర్యల వల్ల మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక నేరాలు తగ్గుతాయని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మహిళల, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ప్రత్యేక నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది.













Click it and Unblock the Notifications
