ఏసీలో ఉన్నా జగన్‌కు చెమటలు- అల్లరిమూకతో అడ్డంకులు: అచ్చెన్న
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 114వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. జమ్మలమడుగు నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసుకున్న ఆయన ప్రొద్దుటూరులో అడుగు పెట్టారు.
113వ రోజున ప్రొద్దుటూరు శివారులోని చౌటపల్లి పాదయాత్రను ప్రారంభవించారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బుడగ జంగాలు, స్వర్ణకారులు, ముస్లింలతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధానంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని నారా లోకేష్ ప్రస్తావించారు. వివేకాను అత్యంత దారుణంగా చంపించింది అబ్బాయిలేనంటూ మరోసారి ఆరోపించారు. ఈ హత్యకేసు నుంచి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలను వెదుక్కుంటున్నారంటూ ధ్వజమెత్తారు. సీబీఐ సైతం ఇదే విషయం చెబుతోందని పేర్కొన్నారు.
శివాలయం సర్కిల్‌లో బహిరంగ సభ ముగించుకుని మైదుకూరు రోడ్డులో వెళ్తున్నప్పుడు ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లను విసిరారు. ఆర్టీసి బస్టాండ్ దాటిన తరువాత స్థానికులతో మాట్లాడే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అవి ఆయన సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. కోడిగుడ్లను విసిరిన వారిని గుర్తించిన తెలుగుదేశం కార్యకర్తలు నారా లోకేష్ ఎదురుగా దేహశుద్ధి చేశారు.
నారా లోకేష్‌పై కోడిగుడ్లను విసరడాన్ని టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, అందుకే దీన్ని చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతోన్నారంటూ ఆరోపించారు.
పాదయాత్రకు వస్తోన్న జన ప్రభంజనం చూసి జగన్‌కు ఏసీలో ఉన్నా చెమటలు పడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్రను అడ్డుకోవాలనే ఏకైక ఉద్దేశంతో అల్లరి మూకలను రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆయనపై జరిగిన దాడి వెనుక వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హస్తం ఉందని, ఆయన ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు..












Click it and Unblock the Notifications