దారి చూపిన కెసిఆర్: ఆ ఛానళ్ల కోసం బాబుపై ఒత్తిడి!
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం రెండు టీవీ చానెళ్ల ప్రసారాలు నిలిపి వేయించిందనే ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి పెంచుతున్నారట. సీమాంధ్రలో పని గట్టుకొని తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన కొన్ని చానెళ్ల ప్రసారాలు అక్కడ కూడా నిలిపివేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారట.
మూడు, నాలుగు టీవీ చానెళ్లపై సీమాంధ్రలోని టీడీపీ నేతలు బాగా ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. ఈ చానెళ్లు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పని గట్టుకొని టీడీపీని ఓడించడానికి శాయశక్తులా కృషి చేశాయని, బూటకపు సర్వేలు తయారు చేసి, వాటిని పదేపదే ప్రసారం చేస్తూ టీడీపీ ఓడిపోతోందన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేశాయని వారు ఆరోపిస్తున్నారట.
పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఒక టీవీ చానెల్ ఇలాంటి సర్వే ఒక దానిని ప్రసారం చేసే ప్రయత్నం చేయడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. ఈమేరకు కొందరు టీడీపీ నేతలు మంగళవారం చంద్రబాబును కలిసి దీనిపై మాట్లాడారు. మూడు, నాలుగు చానళ్లను నిలిపివేయాలని వారు కోరారట.
మనం ముందు చేస్తే తప్పు అవుతుందని, తెలంగాణలో కేసీఆర్ దారి చూపించారని, ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఆయనకు ఇష్టం లేని టీవీ చానెళ్ల ప్రసారాలు నిలిపి వేయించారని, మనమూ అదే పని చేద్దామని, మనకు వ్యతిరేకంగా పని చేసిన చానెళ్లను మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, ఎంఎస్‌వోలకు చెప్పి వాటిని నిలిపివేయిద్దామని వారు సూచించారట. వీటిపై చంద్రబాబు ఆలోచిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

హరీష్ రావుకు విజ్ఞప్తి
తెలంగాణలో నిలిపివేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్ధరించేలా చూడాలని కోరుతూ మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం అందజేశారు.
సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన మంత్రిని వీరు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ కీలకపాత్ర పోషించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాంటి చానెల్ ప్రసారాలను తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం నిలిపివేయడం అప్రజాస్వామికమని, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.












Click it and Unblock the Notifications