ఏపీ, టీ సమానం: జవదేకర్, కేసీఆర్ 'సోనియా' వ్యాఖ్యపై దత్తాత్రేయ గుర్రు
హైదరాబాద్: తమకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలు సమానమేనని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం నాడు చెప్పారు. సింగరేణికి కేంద్రం సహకారం ఉంటుందని చెప్పారు. తెలంగాణ నుండి ప్రతిపాదన వచ్చిన వెంనటే నల్గొండ జిల్లాలో నాలుగువేల మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశమిచ్చామని చెప్పారు. గతంలో ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పెండింగులో ఉండేవన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక వెంటనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలు కొత్తవేనని చెప్పారు. ఇలాంటి కొత్త రాష్ట్రాలకు కేంద్రం సహకారం తప్పకుండా ఉంటుందని, అన్ని రకాల సాయం అందిస్తామన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక వెంటనే పలు ప్రాజెక్టులకు అనుమతులు వెంటనే ఇస్తున్నామన్నారు. రైతులకు న్యాయం జరగాలనే భూసేకరణ బిల్లులో సవరణలు చేశామన్నారు. హైకమాండ్ సిబ్బంది వల్లనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో దోషిగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. హరిత హారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేసిందని కితాబిచ్చారు.
ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పని లేదు, బీజేపీని మరవొద్దు: దత్తాత్రేయ

గతంలో మాదిరి ఢిల్లీ చుట్టూ రాష్ట్రాలు ఇప్పుడు తిరగాల్సిన పని లేదని కేంద్రమంత్రి, తెలంగాణ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రమే రాష్టాలకు నిధులు సమకూరుస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి, తెరాసకు మధ్యనే పోటీ ఉందన్నారు. తొమ్మిది నెలలు గడిచినా కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.
తెరాసవి ఒంటెత్తు పోకడలన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. సోనియానే తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ తెచ్చిందెవరని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోనియా తెలంగాణ ఇచ్చారని, తాను తెచ్చానని కేసీఆర్ అభిప్రాయం.
దీనిపై బండారు దత్తాత్రేయ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఇచ్చింది సోనియా, తెచ్చింది తానని కేసీఆర్ చెప్పుకోవడం ఏమాత్రం సరికాదని, పార్లమెంటులో బిల్లు పెట్టడంలో బీజేపీదే కీలక పాత్ర అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన అఖిల పక్షం ఏర్పాటు చేయాలన్నారు. దత్తాత్రేయ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్ర రావు తరఫున ప్రచారం చేస్తున్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. ఆయన ఎంతోకాలం అధికారంలో ఉండరన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఊరికొకటి కూడా ఇవ్వలేదన్నారు.












Click it and Unblock the Notifications