డైలమా: రూ.వందల కోట్లు: అమరావతిలో భవనాలు శాశ్వతమా?
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని ఆమరావతి పరిధిలో సచివాలయ నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే, తాత్కాలిక నిర్మాణాలకు అవుతున్న ఖర్చు చూస్తుంటే... అవి నిజంగా తాత్కాలికమేనా, లేక శాశ్వతమా? అనే అనుమానాలు కలుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
పదేపదే తాత్కాలిక భవనాలేనని టిడిపి చెబుతున్నా, చేసే ఖర్చు, నిర్మాణాల తీరు చూస్తే శాశ్వత భవనాలను తలపిస్తున్నాయని అంటున్నారు. ఓ వైపు రూ.750 కోట్ల వ్యయంతో తాత్కాలిక సచివాలయ భవనాలను నిర్మిస్తున్నారు. దాని ఎదురుగానే అసెంబ్లీ భవన సముదాయాన్నీ ఇటీవలే ప్రారంభించారు.
వచ్చే శాసనసభ సమావేశాలు రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆగస్టులో జరిగే వర్షాకాల సమావేశాల నిర్వహణకోసం సచివాలయం ఎదురుగానే లక్ష చదరపు అడుగుల పరిధిలో జీ ప్లస్ వన్ కింద అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు.

తాత్కాలిక శాసనసభతోపాటు మండలి సమావేశాల నిర్వహణకు కూడా ఇదే ప్రాంగణంలో భవన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయ భవనాలను సుమారు రూ.750 కోట్ల వ్యయం చేస్తున్నారు. హడ్కో నుంచి తీసుకున్న 50 శాతం రుణాన్ని 10 శాతం వడ్డీతో 15 ఏళ్లలోగా చెల్లింపులు జరపాలి.
శాశ్వత రాజధాని నిర్మాణం పూర్తయిన వెంటనే ఆ భవనాలను ప్రభుత్వం సీఆర్డీయేకు అప్పగిస్తుంది. వాణిజ్య సముదాయాల కాంప్లెక్స్‌గా దీన్ని మార్పు చేస్తారు. ఇందుకోసం జీ ప్లస్ 7 నిర్మాణాలకు అనువుగా పునాదులు నిర్మించారు. అదే తరహాలో శాసనసభ భవనాల నిర్మాణం జరుగుతోంది.
సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం.. శాశ్వత రాజధానిలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజభవన నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం శాశ్వత రాజధానికి రూ.లక్ష కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కేంద్రం ఆర్థిక సాయం పూర్తిస్థాయిలో అందితే శాశ్వత నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.












Click it and Unblock the Notifications