AP TET Results 2024: మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల..
ఏపీ టెట్ ఫలితాలు మార్చి 14న విడుదలకానున్నాయి. ఇప్పటికే AP TET 2024 రెస్పాన్స్ షీట్లు విడుదల చేసిన విద్యాశాఖ టెట్ ఫలితాలు తేదీని ప్రకటించేసింది. గతనెల 27వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ పరీక్షలు మార్చి 9వ తేదీతో ముగిశాయి. అయితే, ఏపీ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే టెట్ పరీక్ష ఫలితాలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సంబంధించి రెస్పాన్స్ షీట్లను ఏపీ విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక, ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ నుంచి తమ యూజర్ ఐడీ, పుట్టిన తేదీలతో రెస్పాన్స్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.
టెట్ పరీక్షలకు హాజరయిన అభ్యర్థులు ప్రిలిమినరీ కీపై ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను వ్యక్తపరచవచ్చు. అనంతరం మార్చి 13వ తేదీన టెట్ పరీక్ష తుది ఆన్సర్ కీ విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 14వ తేదీన ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫైనల్ ఫలితాలు విద్యాశాఖ విడుదల చేయనుంది. ఏపీ డీఎస్సీలో ఈ టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షలు ముగిసిన వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ నోటిఫికేషన్‌లో జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయంలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వాదనలు ఉన్న ఏపీ హైకోర్టు టెట్, డీఎస్సీ మధ్య నాలుగు వారాలు గడువు ఉండేలా పరీక్షలు షెడ్యూల్ చేయాలని మార్చి 4వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విదితమే. దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీల్లో పలు మార్పులను చేసింది.

మార్చి 25నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు...
ఈనెల 30 నుంచి వచ్చేనెల 30 వరకూ ఏపీ డీఎస్సీ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. మార్చి 20వ తేదీ నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 25వ తేదీ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications