అమరావతి రాజధానిగా కొనసాగేనా, బిగ్ టర్న్ - వాట్ నెక్స్ట్..!!
ఏపీకి మూడు రాజధానులా. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందా. నాలుగేళ్ల కాలంలో ఇదే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. ప్రతిపక్షాలు అమరావతికే మద్దతిస్తున్నాయి. ఈ సమయంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఎన్నికల ముందు రాజధాని వివాదం న్యాయపరంగా తేలే అవకాశం కనిపించటం లేదు.
సుప్రీంలో విచారణ వాయిదా : ఏపీ రాజధాని వివాదం ఎన్నికల ముందు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. తాజాగా అమరావతి కేసులను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ కు వాయిదా వేసింది. దాదాపుగా ఏప్రిల్ లోనే ఏపీ శాసన సభ, పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మూడు రాజధాను అంశం ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. వైసీపీ వికేంద్రీకరణ పేరుతో మూడు ప్రాంతాలు..మూడు రాజధానుల నినాదం తో ప్రజల్లోకి వెళ్తోంది. అమరావతి రాజధాని గా ప్రతిపక్షాలు నినదిస్తున్నాయి. అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లింది. దీని పైన విచారణ కొనసాగుతోంది. అయితే, ఎన్నికల్లో గా న్యాయ పరమైన తీర్పు వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల తరువాతనే నిర్ణయం : ఇటు విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని సీఎం భావించినా ఇప్పటి వరకు సాధ్యపడలేదు. సుప్రీంలో సాధ్యమైనంత త్వరగా విచారణ జరగాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు ప్రయత్నం చేసినా ఫలించలేదు. తాజా విచారణ తరువాత ప్రతివాదుల నుంచి లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు చేయటానికి నాలుగు వారాలు సమయం ఇస్తూ ఏప్రిల్ కు తదుపరి విచారణ కోసం వాయిదా వేసారు. ఏప్రిల్‌లో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఏపీ ప్రభుత్వం తాము తీసుకొచ్చిన రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత హైకోర్టు తీర్పు ఇవ్వటం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దీంతో..ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ లోగా ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.

ప్రజా తీర్పు ఎటు : ఏపీలో ఎన్నికల్లో ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే అంశం ఆధారంగా రాజధాని పైన కొత్త ప్రభుత్వం రాజకీయంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. రాజధానుల విషయంలో ఇప్పటికే రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం మాత్రం మూడు ప్రాంతాల్లో అధికార వికేందరీకరణ జరగాలనేది తమ లక్ష్యమని చెబుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఆధారంగా కొత్త ప్రభుత్వంలో రాజధాని అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications