రైలు ప్రమాదంపై ఫోరెన్సిక్ పరిశోధన: పేలుళ్లు కావు
అనంతపురం: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో పేలుళ్లకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ శారదా అవధానం చెప్పారు. ఆదివారం అనంతపురం జిల్లా ప్రశాంతినిలయం రైల్వేస్టేషన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పేలుళ్లు జరిగివుంటే బోగీ భాగం తునాతునకలై ఉండేదన్నారు. అదేవిధంగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడేవన్నారు. అలాంటి ఆనవాళ్లు లేనందున పేలుళ్లు జరగలేదని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, రసాయనాల కారణంగా ప్రమాదం జరిగిందా? అన్నది పరిశోధనలో తేలాల్సి ఉంటుందని చెప్పారు. మొదట కూపేల్లోని చెత్త తొలగించి రసాయనిక నమూనాలు సేకరిస్తామన్నారు. ఇక్కడ సేకరించిన వాటిని భద్రపరిచి స్థానిక పోలీసులకు అప్పగిస్తామన్నారు. వారు నిబంధనల ప్రకారం ప్రొఫార్మాలో ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపుతారన్నారు. వాటిని పరిశోధించి ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని ఆమె అన్నారు.

మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక బృందం నీళ్లు చల్లినందున ఆనవాళ్లు చెదిరిపోయే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ రసాయన పదార్థాలు నీటిలో కలువవన్నారు. నీరు పల్లపు ప్రాంతాలకు చేరే అవకాశం ఉన్నందున ఏదోకచోట నమూనాలు లభ్యమవుతాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగా కిందిభాగంలో వైరింగ్ దెబ్బతినలేదని చెప్పారు. ఏ ప్రాంతం నుంచి మంటలు వ్యాపించాయో అక్కడ వైర్లు కరిగిన తీరునుబట్టి నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కార్బన్ మోనాక్సైడ్ కారణంగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. దట్టమైన పొగల మూలంగా కార్బన్ వెలువడటంతో దాన్ని పీల్చిన ప్రయాణికులు అచేతనావస్థకు చేరుకుని తదనంతరం మంటల్లో కాలిపోయి ఉంటారని అనుమానిస్తున్నట్టు చెప్పారు.
ఎసి బోగీలోకి బయటిగాలి ప్రవేశించే అవకాశం ఉండదన్నారు. కిటికీ అద్దాలు పగులగొట్టిన సమయంలో బయటి నుంచి ఆక్సిజన్ లోపలికి రావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తిచెంది ఉంటాయని భావిస్తున్నామన్నారు. సేకరించిన నమూనాలను ల్యాబొరేటరీలో పరిశోధించి వారం పదిరోజుల్లో ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications