అమరావతిలో సంచలనం.. దావోస్ హామీకి ఆకృతి!
ఈ ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న మరో కీలక అంతర్జాతీయ ఒప్పందం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో భారీ 'ఫుడ్ క్లస్టర్' ఏర్పాటుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ముందుకు వచ్చింది. ఈ మేరకు బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది.

దావోస్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే నేడు సీఎంతో జరిగిన చర్చల్లో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సమగ్రమైన 'వాల్యూ చైన్' నిర్మించాలని యూఏఈ నిర్ణయించింది.
ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మామిడి, అరటి, కోకో వంటి విలువైన ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెస్ చేసి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా మౌలిక వసతులు కల్పించనున్నారు.
వేగంగా అడుగులు.. అన్నదాతలకు మహర్దశ
ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం వల్ల రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ లభించడమే కాకుండా పంటలకు మంచి మద్దతు ధర దక్కనుంది. అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు భారీగా విస్తరించి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సచివాలయంలో జరిగిన ఈ ప్రాధాన్య భేటీలో యూఏఈ ప్రతినిధులతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖలు, ఏపీ ఈడీబీ (AP EDB) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications