AP Weather: మరో మూడు రోజులపాటు ఏపీలో కొనసాగనున్న వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్ బారిపాడు, మల్కాన్‌గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల, గుండా వెళుతుంది. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సోమ, మంగళ, బుధవారాల్లో యానాం, ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రాలో కూడా నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఇక ఆదివారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
మిగిలిన ప్రాంతాల్లో ఉక్కపోత, ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ వేగంగా సాగుతోంది. తాజాగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మరింత వైదొలిగాయి. రానున్న 2 రోజుల్లో మహారాష్ట్ర, ఒడిశా, ఈశాన్య భారత్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షాలు క్రమంగా తగ్గనున్నాయి.
తెలంగాణలోనూ మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణలోనూ మూడు రోజులపాటు సాధారణ వర్షపాతం నమోదు కానుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింద.ి రాబోయే 3 రోజుల పాటు ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఆదివారం కేంద్రీకృతమైన అల్పపీడనం.. నేడు రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోయినట్టు ప్రకటించింది. ఇదే సమయంలో ఆదివారం కాస్త ప్రభావితం చూపిన తూర్పు - పశ్చిమ ఉపరితల ద్రోణి ఆదివారం బలహీనపడినట్టు వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు వెనక్కు వెళ్లే ప్రక్రియ నల్గొండ వరకూ కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని.. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Recommended Video
ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాజాగా, రానున్న 3 రోజులు భారీ వర్షాలు లేవన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటనతో హైదరాబాద్ జనం ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications