ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకం..
రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తూ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద ప్రభుత్వం రూ.1,543.17 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. దీనివల్ల దాదాపు 5.40 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. అలాగే ప్రీ మెట్రిక్ చదువుతున్న 2.51 లక్షల మంది విద్యార్థులకు "తల్లికి వందనం" కార్యక్రమం ద్వారా రూ.326.74 కోట్లను అందజేసినట్లు వెల్లడించారు. కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే అందిస్తూ.. నీట్, జేఈఈ, సివిల్స్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ డీఎస్సీ కోచింగ్ ద్వారా శిక్షణ పొందిన 2,000 మందిలో ఏకంగా 331 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించడం తమ వ్యవస్థ సమర్థతకు నిదర్శనమన్నారు. అలాగే విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు, దారిద్య్ర రేఖకు దిగువన (Below Poverty Line - BPL) పరిధిలో ఉండే అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

గురుకులాలు, హాస్టళ్లలో రికార్డు ఫలితాలు
ప్రభుత్వ అంబేద్కర్ గురుకులాలు, హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని మంత్రి వివరించారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే గురుకులాల్లో టెన్త్‌లో 89 శాతం, ఇంటర్మీడియట్‌లో 92 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. ఇంటర్మీడియట్‌లో 45 మంది విద్యార్థులు 950కు పైగా మార్కులు సాధించగా, టెన్త్ పరీక్షల్లో 591 మార్కులు సాధించిన విద్యార్థి ప్రభుత్వ హాస్టల్ నుంచే రావడం గర్వకారణమన్నారు. జాతీయ స్థాయి పరీక్షల్లో మన విద్యార్థులు రాణించేలా రాష్ట్రవ్యాప్తంగా 14 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
హాస్టళ్లలో సీసీ కెమెరాలతో భద్రత.. లగ్జరీ వసతులు
విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు రూ.104.96 కోట్ల వ్యయంతో 774 హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరిచామని మంత్రి తెలిపారు. ప్రతి హాస్టల్‌లో ఆర్‌ఓ (RO) ప్లాంట్లు, మెకనైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేసి పోషకాహార భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల భద్రత కోసం 989 హాస్టళ్లలో రూ.19.80 కోట్లతో ఏఐ (AI) ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే, విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేకంగా హెల్త్ సూపర్‌వైజర్లు, నర్సింగ్ సిబ్బందిని నియమించామని, అత్యవసర వైద్య పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.10 లక్షల వరకు సహాయం అందిస్తున్నామని వివరించారు.
దివ్యాంగులు, ట్రాన్సుజెండర్ల సంక్షేమానికి సరికొత్త గుర్తింపు
దివ్యాంగుల పింఛన్‌ను కూటమి ప్రభుత్వం రూ.6,000లకు పెంచిందని, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రూ.13 కోట్లకు పైగా నిధులతో సేవలు అందించామని మంత్రి తెలిపారు. 52,263 మందికి ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ చేయడంతో పాటు, ఖాళీగా ఉన్న 329 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామన్నారు.
ట్రాన్సుజెండర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి, వారికి సింగిల్ రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇస్తున్నామని చెప్పారు. వారికి గౌరవప్రద జీవనం అందించేలా స్వయం ఉపాధి కోసం ఆటోలు పంపిణీ చేశామని, విశాఖ జీవీఎంసీలో పలువురిని శానిటేషన్ సూపర్వైజర్లుగా నియమించామని పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు
గత ప్రభుత్వాల కంటే 10 శాతం అధికంగా.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.26,044 కోట్ల నిధులను కేటాయించడమే కాకుండా, వాటి వినియోగంలోనూ రికార్డు స్థాయి పురోగతి సాధించామని మంత్రి వెల్లడించారు. మరోవైపు స్వర్ణ గ్రామం & వార్డు వ్యవస్థ ద్వారా 1.68 కోట్ల ఇళ్ల మ్యాపింగ్, 1.71 కోట్ల కుటుంబాల ఈ-కేవైసీ పూర్తి చేసి పారదర్శక సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలు తమ ముఖ్య పత్రాలను డిజిలాకర్ ద్వారా భద్రపరుచుకునే సదుపాయం కల్పించామని చెప్పారు.
తమ ప్రభుత్వం సంక్షేమాన్ని కేవలం పథకాల పంపిణీకే పరిమితం చేయకుండా.. విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన ద్వారా ప్రతి బలహీన వర్గ కుటుంబ జీవితంలో స్థిరమైన మార్పును తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications