అందుకే విభజన సులువు కాదు, సమైక్యమే: లగడపాటి
న్యూఢిల్లీ: విభజన సులువు కాదని, చివరికి రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. విభజన ఎలా చేసినా అందరికీ ఆమోదయోగ్యమైనది కాదన్నారు. విభజన సమస్యలు పరిష్కారం కావన్నారు. దీంతో చివరకు ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని, విభజన అంత సులువైన విషయం కాదని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేయవద్దని తాము ఢిల్లీ పెద్దలను కోరినట్లు తెలిపారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న వాదనపై ఏకాభిప్రాయం కుదరదు కాబట్టి విభజన కూడా సులువు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు.

శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు రాదని అభిప్రాయపడ్డారు. రేపు కేబినెట్ భేటీకి కూడా జివోఎం నివేదిక వచ్చే అవకాశం లేదన్నారు. అన్ని పార్టీల నిర్ణయం ప్రకారమే తమ పార్టీ అధిష్టానం విభజనపై నిర్ణయం తీసుకుందని లగడపాటి చెప్పారు.
చిద్దూతో సీమాంధ్ర నేతల భేటీ
సీమాంధ్ర కేంద్రమంత్రులు ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. జైరాం రమేష్‌తో భేటీ అనంతరం చిదంబరం, దిగ్విజయ్ సింగ్‌లతో భేటీ అయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్నందున కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు హాజరుకాలేదు. కాగా, అందరికీ అందుబాటులో రాజధాని ఉండాలని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వేరుగా అన్నారు.












Click it and Unblock the Notifications