నీలం సాహ్నీకి సడన్ షాక్: చివరి నిమిషంలో బీజేపీ కీలక నిర్ణయం: టీడీపీ, జనసేనను ఫాలో
అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ సమాయాత్తమౌతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఆమెకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం, మిత్రపక్షం జనసేనను అనుసరించారు. నీలం సాహ్నీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ రాష్ట్రశాఖ తరఫున ఇక ఎలాంటి ప్రాతినిథ్యం ఉండదు. ఈ విషయాన్ని సోము వీర్రాజు వెల్లడించారు.

అఖిలపక్ష భేటీ..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ గురువారం నాడే నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 8వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నీలం సాహ్నీ ఈ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం సహా బీజేపీ, మిత్రపక్షం జనసేన హాజరు కావాల్సి ఉంది.

టీడీపీ, జనసేన సరసన బీజేపీ..
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను మొత్తానికే బహిష్కరించాలని నిర్ణయించింది. దీనిపై ఇంకాస్సేపట్లో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలను బహిష్కరించాలనుకుంటున్నందున అఖిలపక్ష భేటీకి హాజరు కాబోమని గురువారమే తెలిపింది. అదే రోజు సాయంత్రం జనసేన కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది. నీలం సాహ్నీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాము హాజరు కాబోవని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇక తాజాగా- బీజేపీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. తాము కూడా అఖిల పక్ష సమావేశానికి హాజరు కావట్లేదని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ..
ఈ ఎన్నికలను బీజేపీ గానీ, ఆ పార్టీ మిత్రపక్షం జనసేన గానీ బహిష్కరించాలనుకోవట్లేదు. అయినప్పటికీ- నీలం సాహ్నీ ఏకపక్షంగా నోటిఫికేషన్‌ను విడుదల చేశారని, అందుకే అఖిలపక్ష భేటీని నిర్వహించడంలో అర్థం లేదనేది బీజేపీ-జనసేన నేతల వాదన. స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ పాలకపక్షం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నీ బాధ్యతలు స్వీకరించక ముందే రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికల షెడ్యూల్‌ను మీడియాకు లీక్ చేసిందని విమర్శించారు.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త ఎస్ఈసీ సమర్థించడం..ఆఘమేఘాల మీద ఆమోదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. గతంలో బీజేపీ-జనసేన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చేసిన విజ్ఞప్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం విస్మరించిందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లోనూ హఠాత్తుగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తనదిగా నీలం సాహ్నీ ప్రకటించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా తాము అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications