జనంపై రూ.30,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం: జగన్ కు వారసుడిగా తయారయ్యారు
YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద ప్రభుత్వం విధిస్తున్నది సర్దుపోటు అని విమర్శించారు. పెంచేది లేదంటూనే జనాలకు చంద్రబాబు పెడుతున్నవి షాకుల మీద షాకులు.. అంటూ సెటైర్లు వేశారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదు..సామాన్యుడిని నడ్డి విరిచే ఛార్జీలు.. అని చురకలు అంటించారు.

విద్యుత్ సర్దుబాటు, ట్రూఅప్ ఛార్జీలను.. రాష్ట్ర ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేసే ఛార్జీలుగా వైఎస్ షర్మిల అభివర్ణించారు. జనం నెత్తిన చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెడుతున్నది గుదిబండ అంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం జనాలపై మోపిందని గుర్తు చేశారు.
ఇది చాలదన్నట్లు మరో 12,000 కోట్ల రూపాయల మేర అధిక భారాన్ని మోపాలని చూడటం దుర్మార్గమని షర్మిల మండిపడ్డారు. ట్రూ అప్ చార్జీల వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజా అభిప్రాయం సేకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటు అని విమర్శించారు.
కరెంటు ఛార్జీల వీర బాదుడులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు వారసుడని ఎద్దేవా చేశారు షర్మిల. కూటమిని గెలిపిస్తే ఒక్క రూపాయి పెంపు ఉండదని చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను ఆమె గుర్తు చేశారు. అవసరమైతే ఛార్జీల్లో 30 శాతం తగ్గిస్తామని గొప్పలు చెప్పారని పేర్కొన్నారు.
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల్లోనే 30,000 వేల కోట్ల రూపాయల సర్దుబాటు భారాన్ని జనం నెత్తిన పెడుతున్నారని షర్మిల చెప్పారు. హామీలను మరిచి ఓటేసిన పాపానికి పేదోడి ఇళ్లను గుళ్ళ చేస్తున్నారని, ట్రూ అప్ తప్పు మీది కాదు సరే.. అలాగని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తప్పిదాలను ప్రజల నెత్తిన రుద్దుతారా? అని ప్రశ్నించారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన భారాన్ని జనాల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తారా? గత పాలకుల తప్పులను సరిదిద్దడం అంటే జనాలను బాదడమా? ఏనాడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనపు ఛార్జీలు వేయడం ఏంటి? ట్రూ అప్ పేరుతో ఎన్నాళ్లు ఈ దోపిడి? విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు చంద్రబాబు చేసింది నమ్మక ద్రోహం అని అన్నారు.
12,000 కోట్ల రూపాయల సర్దుబాటు భారాన్ని ప్రజలపై పడకుండా చూడాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, వెంటనే చంద్రబాబు గారు ఏపీఈఆర్సీకి లేఖ రాయాలని అన్నారు. గతంలో విధించిన 17,000 వేల కోట్ల రూపాయల భారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications