మీకున్నదే 11 మంది.. ఇంత అవసరమా?
YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై దేశ రాజధానిలో ఉద్యమించాలంటూ వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్రానికి వివరించాలని, ఈ పోరాటానికి కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొంటామంటూ వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారని చెప్పారు.

ఈ నిర్ణయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యతిరేకిస్తోండటం, దీన్ని తప్పుపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో హత్యా రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేయడం ఎందుకంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికే జగన్ ఢిల్లీ వెళ్తోన్నాంటూ మండిపడ్డారు.
తన అయిదు సంవత్సరాల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారంటూ ఆమె జగన్‌ను నిలదీశారు. అలాగే- తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే ఢిల్లీలో ఎందుకు ఆందోళన చేయలేదని ప్రశ్నించారు. హంతకులతో ఇప్పటికీ భుజాలు రాసుకుని తిరుగుతున్నారంటూ ఆరోపించారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల బకాయిలు, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీల గురించి ఏనాడూ పట్టించుకోలేదని, వాటిపై ఏనాడూ ధర్నా చేయలేదని ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తానంటూ ఇప్పుడు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకోవడానికే ఈ ఎత్తు వేశారని షర్మిల అన్నారు. వైఎస్ఆర్సీపీకి ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలని, ఉన్న ఆ కొద్దిమందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొనరా? అంటూ నిలదీశారు. వినుకొండ హత్య వ్యక్తిగత కారణాల వల్లే జరిగిందని పోలీసులు కూడా తేల్చేశారని షర్మిల అన్నారు.












Click it and Unblock the Notifications