వల్లభనేని వంశీకి మరో షాక్..! రిమాండ్ పూర్తికాకముందే సీఐడీ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్ లో హవా కొనసాగించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ71గా చేర్చిన పోలీసులు.. ఆ తర్వాత ఫిర్యాదు దారు సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో రిమాండ్ గడువు ముగిసేలోపే మరో షాకిచ్చారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారు అయిన సత్యవర్ధన్ ను బెదిరించి కేసు వాపసు తీసుకునేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు రెండు వారాల రిమాండ్ పై విజయవాడ సబ్ జైలుకు పంపారు. ఈ రిమాండ్ గడువు రేపటితో ముగియనుంది. మరోవైపు ఆయన బెయిల్ ను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో మరోసారి రిమాండ్ పొడిగింపు కోసం కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. ఆలోపే సీఐడీ వంశీకి షాకిచ్చింది.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని విచారించేందుకు వీలుగా స్థానిక కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పీటీ వారెంట్ తో వంశీని హాజరుపర్చేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీఐడీ.. వంశీ రిమాండ్ ముగియగానే సబ్ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చబోతున్నారు. ఆ విధంగా రెండు కేసుల్లో వంశీ విచారణ ఎదుర్కోక తప్పని పరిస్ధితి. ఇప్పటికే జైల్లో అదనపు సదుపాయాల కోసం వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఆదేశాలు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు మరో కేసులో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుండటంతో వంశీ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications