ఉండవల్లి శ్రీదేవికి గుడ్ న్యూస్
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ అధిష్టానం శుభవార్త అందించింది. ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరకంగా టీడీపీ అభ్యర్థికి ఆమె ఓటు వేయడంతో వైసీపీ అధిష్టానం ఉండవల్లి శ్రీదేవిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. టీడీపీకి మద్దతిచ్చినప్పటికి ఆమెకు పార్టీ అధినేత మొండిచేయి చూపించారు. తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ టికెట్ కేటాయించలేదు. ఉండవల్లి శ్రీదేవి పోటీ చేసే నియోజకవర్గంలో వేరే వ్యక్తి టిక్కెట్ కేటాయించారు.
ఆమె స్థానంలో శ్రవణ్ కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఉండవల్లి శ్రీదేవికి తిరువూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా దక్కలేదు. వైసీపీని వ్యతిరేకించి మరీ టీడీపీకి మద్దతు తెలిపినప్పటికీ తనకు టికెట్ దక్కకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర నిరాశలో కురుకుపోయిన ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు నిండా ముంచారనే అర్థం వచ్చేలా తన అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయింది అంటూ కత్తి సింబల్‌తో ట్వీట్ చేశారు. టికెట్ దక్కకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి తన అసంతృప్తిని ఈ విధంగా బయటపెట్టారనే చర్చ జరిగింది.

ఉండవల్లి శ్రీదేవి అసంతృప్తిని గమనించిన టీడీపీ అధిష్టానం ఆమెకు పార్టీలో కీలక పదవి అప్పగించింది. పార్టీ అధికార ప్రతినిధిగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నియమించారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినట్టు ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఎంపీ టికెట్ ఆశించి బంగపడ్డ పనబాక లక్ష్మికి పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా... ఆమెను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.












Click it and Unblock the Notifications