బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఎండలు దంచి కొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ పన్నీటిజల్లులను చవి చూస్తోంది. బంగాళాఖాతం గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి నేడు కూడా కొనసాగనుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తన ప్రభావం ఏర్పడింది. ఇది మరింత విస్తరించింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కానుంది.

వీటితో పాటు- తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడనున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నేడు కూడా కొనసాగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తుందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదని సూచించారు. ప్రజలు చెట్ల క్రింద నిల్చోకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications