ఏపీలో తుఫాన్, వరద ప్రాంతాల్లో ముందస్తు సన్నాహాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి ఇంకో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఫలితంగా- ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించినట్టయింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏపీలో వర్షాలపై బులెటిన్ విడుదల చేసిందా సంస్థ. శుక్రవారం వరకు ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చనే విషయంపై తన అంచనాలను వెల్లడించింది.

తుఫాన్లు, వరదల సమయంలో చేపట్టాల్సిన సహాయక, పునరావాస చర్యలపై విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేకంగా మాక్ డ్రిల్స్‌ను నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తేదీలను వెల్లడించింది. ఏ జిల్లాలో ఎప్పుడు ఈ మాక్ డ్రిల్స్ చేపట్టే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తుఫాన్‌కు ముందు, ఆ తరువాత ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందనే విషయంపై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది. తీర ప్రాంతాలను ఖాళీ చేయించడం, వారిని యుద్ద ప్రాతిపదికన పునరావాస శిబిరాలకు తరలించడం, తుఫాన్ తరువాత చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలపై ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం, నేలకూలిన చెట్లను తొలగించడం వంటివి ఇందులో ఉంటాయి.
ఇప్పటికే కృష్ణా, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించామని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో దీన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
అలాగే- 12వ తేదీన అంబేద్కర్ కోనసీమ, 16న- విజయనగరం, 22న తూర్పు గోదావరి, 24న నెల్లూరు, 26న అనకాపల్లి, 29న పల్నాడుల్లో ఈ డ్రిల్స్ ఉంటాయి. మే 2వ తేదీన పార్వతీపురం మన్యం, 6న తిరుపతి, 9న బాపట్ల జిల్లాల్లో వీటిని నిర్వహిస్తామని కూర్మనాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications