APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-ఇకపై ఏటా ఇలా..!
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధ (APSRTC)లో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజా రవాణా శాఖలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఈ మధ్య వరుసగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. పలువురు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. వీరికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల వైద్యం అందక చనిపోతున్నారు. దీంతో ప్రభుత్వం వీరి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
గత 11 నెలల్లో ఏపీఎస్ ఆర్టీసీలో మొత్తం 272 మంది ఉద్యోగులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 100 మంది గుండె జబ్బులతో చనిపోగా.. మరో 62 మంది ఇతర తీవ్రమైన వ్యాధులతో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో 45 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ఏటా రెండుసార్లు ఇలా వైద్య పరీక్షలు చేయిస్తారు. ఇతర ఉద్యోగులకు ఏటా ఒకసారి ఇలా పరీక్షలు చేయిస్తారు.

మే 1 నుండి ఇలా ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేయించే విధానం అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఉద్యోగులకు వ్యాధులను ముందుగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం, ఉద్యోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా రెగ్యులర్ గా ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేయించడం ద్వారా వారు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే చికిత్స అందించడానికి వీలు కలుగుతుంది. తద్వారా సంస్థ నిర్వహణలోనూ వారు చురుగ్గా పాలుపంచుకునేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications