బెంగళూరుకు వెళ్తోన్న APSRTC సూపర్ లగ్జరీ బస్సుకు ప్రమాదం- నుజ్జునుజ్జు: దుర్మరణం
కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు 1 డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-44) పై చిక్కబళ్లాపూర్ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాీ ఈ దుర్ఘటన సంభవించింది. కర్నూలు నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. చిక్ బళ్లాపుర జిల్లాలోని దొడ్డపైలగుర్కి సమీపంలో లారీని అత్యంత వేగంగా వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించారు. పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.

మృతులను బస్సు డ్రైవర్ లక్ష్మణ్ (52), బెంగళూరులోని కల్యాణ్ నగర్ నివాసి ఉమాకాంత్ రావు (77)గా గుర్తించారు. దొడ్డపైలగుర్కి సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తోన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీని ఒక్కసారిగా వెనుక వైపు నుంచి ఢీ కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయింది.
క్యాబిన్‌లో డ్రైవర్ శరీరం ఇరుక్కుపోయింది. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా కల్లోల భరితంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, సహాయ చర్యలకు దిగారు. పోలీసులకు సమాచారం అందుకున్న పెరేసంద్ర పోలీసులు, ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. లారీ కింద ఇరుక్కుపోయిన బస్సు క్యాబిన్ భాగాన్ని విడదీసి డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ఒక భారీ క్రేన్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది.
క్రేన్ సహాయంతో బస్సు శకలాలను తొలగించి లక్ష్మణ్ భౌతికకాయాన్ని బయటకు తీశారు. అలాగే మృతి చెందిన ఉమాకాంత్ రావు దేహాన్ని కిటికీ ద్వారా బయటకు తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెరేసంద్ర పోలీసులు అతి కష్టం మీద బస్సు, లారీని హైవే పై నుంచి క్రేన్ల సహాయంతో తొలగించారు.












Click it and Unblock the Notifications