ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ క్లారిటీ- ఈ బస్సుల్లో, ఈ ఐడీ కార్డులతో, పరిధి ఇదే..!
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఇవాళ అధికారులు ఆర్టీసీ క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో నిర్వహించిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సమీక్షలో పాల్గొన్న ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ పథకంపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణానికి అవకాశం కల్పిస్తారా లేదా, ఐడీ కార్డులు చూపించాలా, ఏ బస్సుల్లో అనుమతిస్తారన్న అనుమానాలు నెలకొన్న వేళ ఇవాళ వీరు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరులోని ఆర్టీసీ బస్లాండ్ లో ఇవాళ అధికారులు, సిబ్బంది సన్నద్ధతపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, ఎండీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆర్టీసీ ఛైర్మన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డుతో మహిళలు ఈ బస్సుల్లో ప్రయాణాలు చేయొచ్చని ప్రకటించారు.

అనంతరం మాట్లాడిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తెస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయొచ్చని ప్రకటించారు. మహిళలు ప్రస్తుతం నడుస్తున్న పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ తో పాటు నగరాల్లో మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ, ఆర్డినరీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణాలు చేయవచ్చని క్లారిటీ ఇచ్చేశారు.

ప్రస్తుతం సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ వారాంతంలో ఆయన తిరిగి అమరావతికి రానున్నారు. అనంతరం వచ్చేవారం క్యాబినెట్ భేటీ ఉండబోతోంది. ఇందులో తుది నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన చేస్తారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పరిధి, బస్సులు, ఐడీ కార్డులపై నెలకొన్న సందిగ్ధత వీడిపోయింది. ఇప్పటికే సీఎం, మంత్రులు, ఆర్టీసీ అధికారులు ఎవరికి వారుగా చేసిన ప్రకటనతో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో త్వరలో విధివిధానాలను ఖరారు చేస్తామని నిన్న ఆర్టీసీ ఎండీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications