ఆర్టీసీలో కొత్తగా ఈ కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తాజా నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి మహిళల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వం నిరంతరం ఈ పథకం అమలు పైన ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. కాగా.. దివ్యాంగులకు సైతం ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఉచిత ప్రయాణం కల్పించే సర్వీసులను ఖరారు చేసారు. అధికారికంగా మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయం అమలు ద్వారా దాదాపు రెండు లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటి వరకు వీరికి టికెట్ ధరలో 50 శాతం రాయితీ పొందుతున్నారు.

కాగా, ఈ నిర్ణయం అమలు పైన ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంత మంది టికెట్ రాయితీ పొందుతున్నారు.. ప్రభుత్వం పైన ఏ మేర భారం పడుతుందనేది లెక్కలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. ఆర్టీసీ దాదాపు ప్రతీ ఏటా రూ 188 కోట్ల మేర దివ్యాంగులకు పాస్ ల రూపంలో రాయితీ భరిస్తోంది. వీరిలో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటారు. వీరికి ఇప్పటికే ఉచిత బస్సు పథకం ఉండటంతో.. పురుషులకు కొత్తగా అవకాశం కల్పించాల్సి ఉంది.
కాగా, రాష్ట్రంలో 7.68 లక్షల మంది వికలాంగ ఫించన్లు పొందుతున్నారు. మరో 24 వేల మంది పూర్తిగా మంచానికి పరమితమై ఫించన్లు తీసుకుంటున్నారు. దాదాపుగా రెండు లక్షల మంది ఆర్టీసీ రాయితీ వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత బస్సు అమలు చేస్తే దీనిని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా నిర్ణయంతో వీరికి ఇక నుంచి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో ప్రస్తుతం 50 శాతం వసూలు చేస్తుండగా.. ఇక నుంచి ఉచితంగా ప్రయాణం కల్పించనున్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీరికి అమలు అవుతోంది. భవిష్యత్ లో ఈ కేటగిరీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. త్వరలోనే ఈ మేరకు అధికారికంగా మార్గదర్శకాలు జారీ కానున్నాయి.












Click it and Unblock the Notifications