ఉగాది పండగకు ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సర్వీస్..షిప్‌మంత్ర: ఈ రద్దీ మార్గంలో ప్రారంభం..!!
ఉగాది పండగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సర్వీస్ ను ప్రారంభించింది. డోర్ టు డోర్ కార్గో సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం షిప్ మంత్ర అనే స్టార్టప్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీశోభాకృత్ ఉగాది (Ugadi) పండగ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. తిరుమల (Tirumala) సహా ప్రధాన ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాల (Temples) వద్ద బారులు తీరి నిల్చున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఛైత్ర నవరాత్రి తొలి రోజు కావడం వల్ల అటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలను కన్నులపండువగా జరుపుకొంటోన్నారు.

కొత్త వ్యవస్థ..
ఈ పండగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) అధికారులు సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. తమ కార్గో వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తృతం చేశారు. డోర్ టు డోర్ కార్గో సర్వీస్ (APSRTC door to door cargo service) ను ఇవ్వాళ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికోసం షిప్ మంత్ర (Shipmantra) అనే లాజిస్టిక్ స్టార్టప్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ఈ స్టార్టప్ కంపెనీ- టెక్నికల్, లాజిస్టిక్ సపోర్ట్ ను అందజేస్తుంది.

విజయవాడ-విశాఖపట్నం
కార్గో రవాణాకు అవసరమైన జీపీఎస్ సహా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ సమకూర్చుతుంది. తొలిదశలో విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈ డోర్ టు డోర్ కార్గో సర్వీస్ ను ప్రవేశపెట్టారు. సరుకులు, ఇతర వస్తువులను ఇంటి వద్దే పికప్ చేసుకోవడం, ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వడం దీని ఉద్దేశం. దశలవారీగా దీన్ని మరింత విస్తరించనున్నారు. క్రమంగా దీన్ని తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చిత్తూరు, మదనపల్లి వరకు చేపట్టనున్నారు.

ఇతర రాష్ట్రాలకూ..
హైదరాబాద్ (Hyderabad)తో పాటు చెన్నై (Chennai), బెంగళూరు (Bengaluru)కు సైతం ఈ డోర్ టు డోర్ కార్గో సర్వీస్ ను అందుబాటులోకి తీసుకుని వస్తామని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) తెలిపారు. 2015లో తొలిసారిగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కార్గో సర్వీస్ ను ప్రవేశపెట్టారు. మొదట్లో ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని రికార్డు చేసిందీ సర్వీస్. ఇప్పుడు 160 కోట్ల రూపాయలకు చేరింది.

తొలి మూడు ఆర్డర్లకు ఫ్రీ..
ఇక తాజాగా డోర్ టు డోర్ కార్గో సర్వీస్ ను అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునే వెసలుబాటు లభిస్తుందనే అంచనాలు ఏపీఎస్ఆర్టీసీ అధికారుల్లో వ్యక్తమౌతోంది. డోర్ టు డోర్ కార్గో సర్వీస్ లో తొలి మూడు బుకింగ్ లను ఉచితంగా అందజేస్తారు. ప్రైవేట్ సెక్టార్ లో కార్గో సర్వీసులకు పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ- రవాణా రంగంలో తమకు ఉన్న అనుభవంతో దీన్ని అధిగమిస్తోన్నామని, సమయ పాలనకు ప్రాధాన్యత ఇస్తోన్నామని ద్వారకా తిరుమలరావు చెప్పారు.












Click it and Unblock the Notifications