ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు..!!
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. శీతాకాలం వేళ ఏసీ బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ తగ్గింది. పలు బస్సుల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో..పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల ఛార్జీలను 10 నుంచి 20 శాతం వరకు తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రయాణీకుల రద్దీ పెంచుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.
శీతాకాలం ఎఫెక్ట్
పెరుగుతున్న చలితో ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సులకు డిమాండ్ తగ్గుతోంది. పలు రూట్లలో బస్సులు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో, ప్రయాణీకులను ఆకట్టుకోవటానికి ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన చలి కారణంగా ఏసీ బస్సుల్లో ప్రయాణానికి ప్రయాణీకులు ముందుకు రావటం లేదు. గణనీయంగా తగ్గిన ప్రయాణీకుల సంఖ్యతో ఏసీ బస్సులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో..ఏసీ బస్సుల ఛార్జీలను పది నుంచి 20 శాతం వరకు తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో నిండిన సీట్ల సంఖ్యను బట్టి ఛార్జీలను డిసెంబర్ నెలకు మాత్రమే వర్తించేలా ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఆదేశించింది.

ధరల తగ్గింపు
దీని ద్వారా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఛార్జీల తగ్గింపు నిర్ణయాధికారాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవో లకు అప్పగించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయాలు వెలువడుతున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖ పట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గిస్తూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఆది, శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు అమలు కానుంది. తగ్గించిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 10 శాతం మేర తగ్గించినట్లు అధికారులు ప్రకటించారు.
ఏ రూట్ లో ఎంత
అదే విధంగా..ఆదివారం నాడు హైదరాబాద్ కు, శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూటులో చార్జీ తగ్గింపు ఉండదని అధికారులు స్పష్టం చేసారు. ఇక, విజయవాడ - బెంగళూరు మధ్య తిరిగే వెన్నెల స్లీపర్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 20 శాతం తగ్గించారు. విజయవాడ - బెంగళూరు వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో చార్జీ 2,170 రూపాయల నుంచి 1,770 రూపాయలకు తగ్గించారు. విజయవాడ- బెంగళూరు మధ్య అమరావతి ఏసీ బస్సుల్లో చార్జీ 1,870 రూపాయలు ఉండగా దాన్ని 1,530 రూపాయలకు తగ్గించారు. విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో చార్జీ 10శాతం తగ్గిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications